ప్రతీకాత్మక చిత్రం
రాయ్‌పూర్ : అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు చేయిస్తున్న సూపర్‌వైజర్‌ను మావోయిస్టులు అతికిరాతకంగా చంపేశారు. హత్య అనంతరం జేసీబీ, ట్రాక్టర్లు సహా 12 వాహనాలను తగులబెట్టారు. తిరుగుప్రయాణంలో అడ్డొచ్చిన పోలీసు బృందంపై నక్సల్స్ కాల్పులు జరపగా.. ఇద్దరు సాధారణ పౌరులు, ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బుల్లెట్ దెబ్బలుతిన్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
చింతకుప్ప రోడ్డుపై : సుకుమా జిల్లా చింతకుప్ప ప్రాంతంలో రహదారి నిర్మించవద్దంటూ మావోయిస్టులు గతంలో హెచ్చరికలు జారీచేశారు. ఆదివారం పనులు జరుగుతున్న ప్రాంతానికి వచ్చిన మావోయిస్టు బృందం.. కాంట్రాక్టర్ సూపర్‌వైజర్‌ను చితకబాది చంపేసి, వాహనాలను తగులబెట్టి తిరుగుప్రయాణమైంది. అంతలోనే వారికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందం ఎదుదైంది. ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. గంటలపాటు కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక మావోయిస్టు మరణించారని పోలీసులు తెలిపారు. గాయపడ్డ కానిస్టేబుళ్లలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ సమాచారం అందిన వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలికి పంపినట్లు చెప్పారు. ఈ వార్తకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment