శుక్రవారం మాస్‌కాపీయింగ్‌కు యత్నించిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు
ఖానాపూర్: పదో తరగతి ప్రశ్నపత్రం వాట్సాప్‌లో బయటకు వచ్చింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం వెలుగు చూసింది. సీఐ ఆకుల అశోక్, ఎస్‌ఐ కొల్లూరి వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో పదో తరగతి ఫిజికల్ సైన్స్ పేపర్–1 పరీక్ష ప్రారంభం అయిన గంటకే వాట్సాప్‌లో బయటకు వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు పాఠశాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో మాస్‌కాపీయింగ్ కోసం ఉపాధ్యాయులు, సిబ్బంది జవాబు పత్రాలను సిద్ధం చేస్తుండగా వారిని గుర్తించారు.
ఈ మేరకు యాజమాన్యాన్ని విచారించగా.. మరో ప్రైవేట్ పాఠశాలలో చదివే ప్రముఖ వ్యాపారి రమణప్రశాంత్ కూతురు కోసం జవాబు పత్రాలు సిద్ధం చేస్తున్నట్లు వారు తెలిపారు. సంబంధిత వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తన మిత్రుడైన లక్ష్మణచాంద మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహించే ఉపాధ్యాయుడు సద్దు మన్మథరెడ్డి ద్వారా తనకు వాట్సాప్ ప్రశ్నపత్రం వచ్చిందని తెలిపాడు. వెంటనే వాట్సాప్ ద్వారా ఆ పేపర్‌ను ప్రైవేట్ పాఠశాల పీఈటీ గంగాధర్‌కు షేర్ చేసినట్లు పేర్కొన్నాడు. ప్రస్తుతం మన్మథరెడ్డి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని అదుపులోకి తీసుకొని అసలు సూత్రధారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామని, అలాగే రమణ ప్రశాంత్‌తో పాటు పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది గంగాధర్, ఎస్.రవికుమార్, ఇప్ప సాయన్న, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ఒకరి సస్పెన్షన్: డీఈవో
ఈ ఘటనపై ఉపాధ్యాయుడు మన్మథరెడ్డిని సస్పెండ్ చేసినట్లు డీఈవో ప్రణిత తెలిపారు. ప్రశ్నపత్రం లీక్ అయిందని తన దృష్టికి రాగానే.. ఎంఈవో గుగ్లావత్ రాంచందర్‌తో కలసి పరీక్ష కేంద్రాలను సందర్శించి వివరాలు తెలుసుకున్నానని చెప్పారు. ఇందులో ఏమైనా ప్రైవేట్ పాఠశాలల భాగస్వామ్యం ఉందా అనే కోణంలో సైతం విచారణ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment