మానుకోటలో దొంగల బీభత్సం   | Massive Theft In Maanukota | Sakshi
Sakshi News home page

మానుకోటలో దొంగల బీభత్సం  

Published Sat, May 19 2018 12:59 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM

Massive Theft In Maanukota - Sakshi

జడల లక్ష్మిరేణుక ఇంటిలో వివరాలు సేకరిస్తున్న క్లూస్‌ టీం

మహబూబాబాద్‌ రూరల్‌ : చోరీ జరిగి 45.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.47వేల నగదు అపహరణకు గురైన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని రెండు వేర్వేరు చోట్ల చోట్ల జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన జడల లక్ష్మిరేణుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కళాసీబస్తీ ఎంపీపీఎస్‌లో క్లర్క్‌గా పని చేస్తుంది. ఆమె సోదరుడు రిటైర్డ్‌ ఎస్సై బొగ్గుల సత్యనారాయణ ఆరోగ్యం క్షీణించడంతో పరామర్శించడానికి గురువారం సాయంత్రం వరంగల్‌కు వెళ్లింది.

ఆ రోజు రాత్రి ఆమె అక్కడే బస చేసింది. శుక్రవారం ఉదయం తిరిగి మానుకోటకు చేరుకుని గేట్‌ తీసే సరికి ఇంటికి వేసిన తాళం లేకుండా తలుపులు తెరిసి ఉండడం చూసింది. ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి రెండు బీరువాల్లోని దుస్తులు, ఇతర సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దొంగలు బీరువాల తలుపులు పగులకొట్టి  45.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.7 వేల నగదును దోసుకెళ్లినట్లు గ్రహించిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది.

డీఎస్పీ ఆంగోత్‌ నరేష్‌కుమార్, టౌన్‌ సీఐ జబ్బార్, ఎస్సైలు అరుణ్‌కుమార్, రమేష్‌బాబు, సీసీఎస్‌ సీఐ శ్రీనివాసులు, డీసీఆర్బీ సీఐ తిరుపతి, ఐటీ కోర్‌ సీఐ శ్యాంసుందర్‌ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. క్లూస్‌టీం బృందాలు డాగ్‌ స్క్వాడ్‌తో ఇంటి పరిసరాలను తనిఖీ చేశారు. అనంతరం బాధితులరాలు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ క్యాంప్‌ కార్యాలయం, టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

కిరాణ షాపులో రూ.40 వేల అపహరణ..

జిల్లా కేంద్రంలోని ఇల్లందు రోడ్డులోని కర్లపాటి నారాయణమూర్తికి చెందిన కిరాణ షాపులో చోరీ జరగగా రూ.40 వేలు అపహరణకు గురయ్యాయి. శుక్రవారం తెల్లవారుజాము 3 నుంచి 4 గంటల మధ్యలో ఓ యువకుడు బండరాయితో దుకాణం తలుపు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు సీసీ పుటేజ్‌లో రికార్డు అయింది. బాధితుడు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement