వజ్రపుకొత్తూరు: ఓ పదమూడేళ్ల బాలుడు రెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పరిది బెండి గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనపై బాలిక తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. వజ్రపుకొత్తూరు ఎస్‌ఐ కేవీ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..భర్తతో విభేదాల కారణంగా బాలిక తల్లి కొంత కాలంగా బెండిలోని కన్నవారి ఇంటి వద్ద ఉంటోంది.అదే గ్రామంలో పోలాకి మండలానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బంధువుల ఇంటి వద్ద ఉంటూ బెండి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాలుడు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బుధవారం వజ్రపుకొత్తూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారించి బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ బి. ప్రసాదరావు పూర్తిస్థాయి దర్యాప్తు చేయనున్నారు.
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం
కావలి అర్బన్: ఐదేళ్ల చిన్నారిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం వైకుంఠపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. సీఐ కథనం మేరకు వైకుంఠపురం సమాధుల దర్గా ప్రాంతానికి చెందిన దంపతులకు కుమార్తె ఉంది. ఆ పక్కనే ఉన్న చేవూరివారి తోటకు చెందిన చిట్యాల మణి అనే యువకుడు పట్టణంలో తోపుడు బండిపై మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాధిత చిన్నారి అమ్మ తమ్ముడితో మణి స్నేహం చేస్తూ తరచూ ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. మంగళవారం ఆమె ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరు. అంగట్లో తినే వస్తువులు కొనిస్తానని చిన్నారికి మాయమాటలు చెప్పి తన బైక్‌పై ఎక్కించుకుని వైకుంఠపురం సమీపాన ఉన్న అటవీ ప్రాంతం జామాయిల్ చెట్లలోకి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిని కర్రతో కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి చిన్నారి ఒంటరిగా ఏడుస్తుండడాన్ని గమనించాడు. తన బైక్‌పై ఎక్కించుకుని చిన్నారి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. చిన్నారి నొప్పులతో ఏడుస్తుండగా అడిగిన తల్లికి జరిగిన విషయం వివరించింది. తల్లిదండ్రులు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారికి ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
బాలికపై అత్యాచారం
పాలసముద్రం: ఓ బాలికపై అత్యాచారం జరగడంతో.. ఆ అవమాన భారం భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఎస్‌ఆర్‌ఆర్ కండ్రిగ పంచాయతీ తొట్టికండ్రిగ దళితవాడకు చెందిన కే.కుమార్ కుమారుడు కే.మునిస్వామి(22)ఈ దారుణానికి పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ బాలిక బహిర్భూమికి వెళ్లిన సమయంలో నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేయడంతోపాటు ఆమె పెదవులు కొరికేశాడు. ఆ బాధ భరించలేక ఆమె కేకలు వేసింది. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకోగా మునిస్వామి పారిపోయాడు. ఆ అవమానం సహించలేక బాలిక ఇంట్లోని కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి, మంటలు ఆర్పి, వెంటనే తమిళనాడు శోళింగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ప్రథమ చికిత్స చేసి తిరుపతి రూయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని రూయా డాక్టర్లు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment