ప్రకాశం , దర్శి రూరల్: పట్టణంలోని క్రిస్టియన్ కాలనీకి చెందిన పండూరి శంకర్ అనే వ్యక్తికి పది రోజుల క్రితం ఓ ఫోన్ వచ్చింది. మీకు ఎయిర్ టెల్ లక్కీ డ్రాలో సామ్‌సంగ్ జె–7 మొబైల్ తగిలిందని చెప్పారు. తనకే ఎందుకు వచ్చిందని ప్రశ్నించగా మీరు ఎయిర్‌టెల్ నంబర్‌ను పదేళ్ల నుంచి వాడుతున్నారని, అందుకే అవకాశం వచ్చిందని చెప్పకొచ్చారు. ఆ సెల్ బయట మార్కెట్‌లో రూ.16 వేలు ఉందని, డ్రాలో వచ్చినందున మీకు రూ.4 వేలకే ఇస్తున్నామని నమ్మించారు. పదే పదే ఫోన్ చేసి విసుగు వచ్చేలా మాట్లాడటంతో సరే పంపించండన్నాడు. శంకర్ చిరునామాను ఫోన్‌లో అడిగి తెలుసుకుని వెంటనే వారు ఓ బాక్స్‌ను పోస్టులో పంపారు.
ఆ వెంటనే మళ్లీ ఫోన్ చేసి పోస్టాఫీస్‌కు వెళ్లి రూ. 4 వేలు చెల్లించి సెల్ తీసుకోవాలని చెప్పారు. బుధవారం శంకర్ పోస్టాఫీస్‌కు వెళ్లి రూ.4 వేలు చెల్లించి పార్శిల్ తీసి చూడగా అందులో మట్టిముద్ద, నాలుగు రేకు బొమ్మలు కనిపించాయి. బాధితుడు వచ్చిన నంబర్‌కు తిరిగి కాల్ చేయగా పని చేయలేదు. మరో నంబర్ నుంచి కాల్ చేయగా దాన్నీ కట్ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాడు. మళ్లీ మరొక నంబర్‌తో ఫోన్ చెయ్యగా మీకు వచ్చిన పార్శిల్‌ను వీడియో తీసి పంపాలని చెప్పి ఆ తర్వాత స్విచ్చాప్ చేసుకున్నాడు. పార్శిలో ఎక్కడి నుంచి వచ్చిందో పరిశీలించగా స్మార్ట్ గెలాక్సీ, 10బై10, విలేజ్ బేగంపూర్, ఢిల్లీ..అని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment