మదనపల్లెలో హత్యకు గురైన నాగజ్యోతి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (ఫైల్)
ఇటీవల కాలంలో జిల్లాలో హత్యలు, ఆత్మహత్యకులు పెరిగాయి. పరస్త్రీ వ్యామోహం.. కట్టుకున్న భార్యపై అనుమానం.. భర్త మరొకరితో సన్నిహితంగా ఉండడం లాంటి చిన్నపాటి కారణాలు నిండు ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. మరికొందరు చిన్న విషయాలకే ఆవేశానికి లోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
చిత్తూరు అర్బన్: ప్రపంచ దేశాల్లో భార్య, భర్త బంధానికి మన దేశం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇటీవల పాశ్చాత్య సంస్కృతి ఇక్కడికీ విస్తరిస్తోంది. దీంతో శారీరక వ్యామోహం మోజులో పడిపోయి చాలా మంది కుటుంబ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. భార్య మరొకరితో తిరుగుతోందని, పరువు పోతోందని అంతమొందిస్తున్నారు. అలాగే తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి హతమారుస్తున్నారు. భర్తపైన, లేదా భార్యపైన అనుమానం ఉంటే పెద్దలకు చెప్పాలి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. భర్త, లేదా భార్య ప్రవర్తన నచ్చకపోతే చట్టబద్దంగా విడాకులు తీసుకోవచ్చు. అంతేతప్ప ప్రాణాలు తీయడం మన సంస్కృతి కాదు. భర్త తిట్టాడని నెలల వయస్సున్న తల్లి ప్రాణాత్యాగం చేసుకుంటే తన ఇద్దరు కూతుర్లకు ఏం నేర్పించాలనుకుంటోందో ఆలోచించాలి. ఇటీవల ఎక్కువగా సహజీవనం చేస్తున్నారు. మోజు తీరిపోయిన తరువాత ఒకర్ని ఒకరు వదిలించుకోవడానికి ప్రాణాలు తీస్తున్నారు. ఇది సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వడంతో పాటు మనుషుల్లోని మానవత్వాన్ని నిలువునా చంపేస్తోంది.
ఈ మధ్యనే ఎక్కువ..
♦ గత నెల 26న వి.కోటకు చెందిన మాధవీరాణి తన భర్త శివాజీగనేషన్‌ను దారుణంగా హత్య చేసింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భార్య తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో భర్త గర్భసంచి తొలగించి శస్త్రచికిత్స చేయించాడు. తన వంశం పేరు నిలబెట్టడానికి మగబిడ్డ కావాలని, రెండో పెళ్లి చేసుకుంటా నని భార్యను వేధించాడు. సహనం కోల్పోయిన ఆమె కత్తితో భర్తను పొడిచి చంపింది.
♦ చిత్తూరు గ్రామీణ మండలంలో భర్త చనిపోయిన వనితతో సహజీవనం చేస్తూ ఆమెను అనుమానించిన భరత్ అనే యువకుడు ఆదివారం కత్తితో నరికిచంపాడు. కనికరంలేకుండా రెండో తరగతి చదువుతున్న వనిత కుమారుడు మహేంద్రన్ గొంతుకోసి చంపి ఆపై తనూ ఆత్మహత్య చేసుకున్నాడు. వనిత కుమార్తె జీవిత ఇప్పుడు రోడ్డున పడింది.
♦ మార్చి 15న పీలేరులోని బోయనపల్లెలో పార్వతి వేరే వ్యక్తితో చనువుగా ఉందని అనుమానించిన భర్త సుబ్రమణ్యం కత్తితో నరికి చంపేశాడు. ఫిబ్రవరి 10న మదనపల్లెకు చెందిన లక్ష్మి తన వివాహేతర బంధానికి భర్త రామ్‌నాథ్ అడ్డుగా ఉన్నాడని చంపేసింది. ఇలాంటి ఘటనలు జిల్లాలో ఇటీవల పదుల సంఖ్యలో నమోదయ్యాయి.
♦ ‘భార్యాభర్తల మధ్య విభేదాలొచ్చాయి. విడాకులు తీసుకున్నారు. అయినా భార్య అందరిముందు అవమానకరంగా ప్రవర్తించడం.. హేళనలగా మాట్లాడటాన్ని తట్టుకోలేకపోయిన భర్త కిరాయి వ్యక్తులతో భార్యను పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేయించాడు. మదనపల్లెలో గతవారం జరిగిన ఈ ఘటనలో నాగజ్యోతి అనే న్యాయవాది హత్యకు గురికాగా.. ఆమె భర్త జితేంద్ర జైలులో ఉన్నాడు.’
♦ ‘నిన్నటికి నిన్న.. వి.కోట మండలం ముదరందొడ్డి వద్ద నాగరాజు, శిరీష దంపతులు ఇంట్లో చిన్న గొడవపడ్డారు. క్షణికావేశంలో పరుగెడుతూ శిరీష బావిలో దూకేసింది. భార్యను రక్షించుకునే క్రమంలో తనకు ఈత రాదనే సంగతి మరచిపోయి నాగరా జు కూడా బావిలోకి దూకేశాడు. ఇద్దరూ శవాలై పైకితేలారు. వీరిపిల్లలైన ఆర్నెళ్ల వయస్సున్న బన్ని, మూడేళ్ల వయస్సున్న హేమంత్ అమ్మానాన్నను కోల్పోయారు.’’
♦ ‘తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త మండ్యం రెడ్డెయ్యను భార్య నాగసుబ్బమ్మ అలియాస్ సుబ్బులమ్మ తన ప్రియుడితో కలి సి హత్య చేయించింది. ఈ సంఘటన పెద్దమండ్యం మండలంలోని వెలిగల్లు పంచా యతీ నడింబురుజులో ఆదివారం జరిగింది.’
ఆందోళన కలిగిస్తోంది...
ఈ మధ్య జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, అనుమానాల వల్లే మెజారిటీ హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి బంధాలు ఎక్కువకాలం నిలబడవు. పోలీసుశాఖ ఎప్పటికప్పుడు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. సమస్య ఏదైనా పోలీస్ స్టేషన్‌కు రండి. ఏదో ఓ రకంగా జరగాల్సిన నేరాన్ని ఆపడానికి ప్రయత్నిస్తాం. – ఎస్‌వి.రాజశేఖర్‌బాబు, ఎస్పీ, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment