నాగర్‌కర్నూల్ క్రైం : టెక్నాలజీ పెరిగే కొద్ది ఆన్‌లైన్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ కేటుగాళ్లు అమాయకులను టార్గెట్ చేసి వారి బ్యాంకు ఖాతాలనుంచి డబ్బులు స్వాహా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి వస్తువును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం, ఆన్‌లైన్ ద్వారా ఫీజులు , రీఛార్జ్‌లు, టిక్కెట్లు బుక్ చేయడంతోపాటు ఇతర రకాల పేమెంట్లు చేస్తుంటారు. ఇలా ఆన్‌లైన్‌లో లావాదేవీలు జరిపేటప్పుడు లేదా బ్యాంకర్ల పేర్లతో ఫోన్‌చేసి వ్యక్తిగత డాటా సేకరించి వారి అకౌంట్లలో డబ్బులు కొట్టేస్తున్నారు. ఆన్‌లైన్ మోసాలు జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతున్నాయి.
గత నెలలో జరిగిన సంఘటనలు
అక్టోబర్ 23న నాగర్‌కర్నూల్ పట్టణానికి చెందిన చెన్న రమేష్ తన స్మార్ట్ ఫోన్‌లో మిత్రుడికి తేజ్ యాప్ ద్వారా రూ.10వేల నగదు పంపాడు. కానీ ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ కాలేదు. దీంతో గూగుల్‌లోని తేజ్ యాప్ కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశాడు. వాళ్లు చెప్పినట్లుగా మరో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని అడిగిన వివరాలు నమోదు చేశాడు. కాసేపటికి చెన్న రమేష్ అకౌంట్‌లో నుంచి రూ.50వేలు డ్రా అయ్యాయి. దీంతో అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ూ అక్టోబర్ 10న నల్లవెల్లి గ్రామానికి చెందిన నాగిరెడ్డికి ఎస్‌బీఐ బ్యాంకు నుంచి అంటూ ఫోన్‌కాల్ వచ్చింది. ఏటీఎం కార్డు గడువు ముగిసిందని (ఎక్స్‌పైరీ) చెప్పారు. పాతకార్డు బ్లాక్‌చేసి కొత్తకార్డు పంపడానికి వివరాలు అడిగారు. ఫోన్‌కు వచ్చిన మెసేజ్ వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ఖాతాలో నుంచి రూ.50వేలు డ్రా అయ్యాయి. దీంతో అతడు ఈనెల 23న స్థానిక పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాల్స్, మేసేజ్‌లతో జాగ్రత్త
వినియోగదారులకు బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నామని, అకౌంట్ వివరాలు, ఏటీఎం, క్రెడిట్ కార్డుల వివరాలు తెలియజేయాలని అడుగుతుంటారు. అలాంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు వెంటనే సంబందిత బ్యాంకులకు ఫిర్యాదు చేయాలి. కొన్నిసార్లు బహుమతులు గెలుచుకున్నారని ఫోన్లు, మెసేజ్‌లు వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేయాలి.
వ్యక్తిగత వివరాలు చెప్పవద్దు
ఏదైనా ఫోన్‌నంబర్‌ల నుంచి ఇతరులు ఫోన్‌లు చేసి ఖాతానంబర్లు, వ్యక్తిగత వివరాలు అడిగినప్పుడు వారికి వ్యక్తిగత వివరాలు తెలుపవద్దు. ఒకవేళ వివరాలు తెలియజేస్తే అకౌంట్‌లో ఉన్న నగదు ఖాజేసే అవకాశం ఉంటుంది.
డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త
వెబ్‌సైట్లలో ఫైల్స్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. తెలియని అనుమానాస్పద సైట్ల నుంచి ఫైల్స్ డౌన్‌లోడ్ చేయడం వల్ల వ్యక్తిగత కంప్యూటర్‌లో సమస్యలు వస్తాయి. వెబ్‌సైట్లలో నుంచి పాటలు, వీడియోలు, డౌన్‌లోడ్ చేయడం వల్ల అందులో ఉన్న సాఫ్ట్‌వేర్, మాల్‌వేర్ కంప్యూటర్లలో ఉన్న డాటాను హ్యాకర్లకు చేరవేస్తుంది. వెబ్‌సైట్లలో నుంచి ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు ఆ ఫైల్స్‌ను యాన్‌టీవైరస్ ద్వారా స్కాన్ చేసుకోవాలి.
పాస్‌వర్డ్ మార్చాలి
ఆన్‌లైన్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే నెట్‌బ్యాంకింగ్, ఏవైనా యాప్‌లకు సంబందించినవి, అకౌంట్‌లకు సంబందించిన వాటి పాస్‌వర్డ్‌లు తరుచూ మారుస్తూ ఉండాలి. అలాగే ప్రతిఒక అకౌంట్‌కు ఒకే పాస్‌వర్డ్ పెట్టుకోకూడదు.
వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయొద్దు
అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్‌చేసి వ్యక్తిగత వివరాలు, అకౌంట్ వివరాలు అడిగితే వారికి ఎలాంటి సమాచారం అందించవద్దు. ఫోన్‌కాల్‌కు సంబందించిన సమాచారాన్ని పోలీసులకు వెంటనే తెలియజేయాలి. – భగవంత్‌రెడ్డి, ఎస్‌ఐ, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment