రాళ్లు రువ్వుతున్న ధర్మవరపు మురళిని పక్కకు తీసుకెళ్తున్న పోలీసులు (ఫైల్)
అనంతపురం ,రాప్తాడు: గొందిరెడ్డిపల్లి ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో జరిగిన ఘటనలో 34 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. పది మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపైన, ఎనిమిది మంది టీడీపీ నాయకులపైన, అలాగే కానిస్టేబుల్‌పై జరిగిన దాడికి సంబంధించి ఇరు పార్టీలకు చెందిన 16 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఆరోజు ఏం జరిగిందంటే..?
ఈ నెల నాలుగో తేదీన గొందిరెడ్డిపల్లిలో జరిగిన ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మిడతల శీనయ్య వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తామని చంద్రబాబు ఫొటోపై పాలు పోసి ప్రమాణం చేయాలని డ్వాక్రా మహిళలకు హుకుం జారీ చేశాడు. దీంతో కొందరు మహిళలు తాము చంద్రబాబుకు ఓటు వేయబోమని, వచ్చే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తామని స్పష్టం చేశారు. రెచ్చిపోయిన మిడతల శీనయ్య ఓ మహిళను చెప్పుకాలితో తన్నాడు. దీంతో మహిళలు, గ్రామస్తులు శీనయ్యపై ఎదురు దాడికి దిగారు. పోలీసులు కూడా టీడీపీ నాయకులకే వత్తాసు పలకడంతో ఆగ్రహించిన మహిళలు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న మంత్రి పరిటాల సునీత సోదరుడు, టీడీపీ మండల ఇన్‌చార్జి ధర్మవరపు మురళి, మంత్రి సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ అనుచరులు పెద్ద ఎత్తున గ్రామంలోకి వచ్చి హల్‌చల్ చేశారు. దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మహిళలు అనే ఇంగిత జ్ఞానం లేకుండా వారిని చితకబాదారు. ఈ దాడిలో గ్రామానికి చెందిన హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితో పాటు మరో ఐదుగురుకు స్వల్పంగా గాయపడిన విషయం విదితమే.
8 మందిపై కేసు నమోదు
టీడీపీ నేతలు దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు. మిడతల శీనయ్య, ఈశ్వరయ్య, మహమ్మదయ్య, డీలర్ మల్లికార్జున, పుటుక నాగభూషణం, మిడతల ముత్యాలు, మిడతల ఉజ్జినయ్య, ఎం.బండమీదపల్లి మాజీ సర్పంచు దుగ్గపాటి శ్రీనివాసులుతో పాటు మరికొంత మంది ఘటనలో ఉన్నట్లు కేసు నమోదు చేశారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపైనా..
ఈ ఘటనలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు మాత్రమే దెబ్బలు తగిలాయని, టీడీపీ కార్యకర్తలకు ఒక్కరికి కూడా గాయం కాలేదని గొందిరెడ్డిపల్లి వైఎస్సార్‌సీపీ నాయకులు చెబుతున్నారు. అయితే కేసును తప్పుదోవ పట్టించేందు కోసం టీడీపీకి చెందిన గోపాల్, మల్లికార్జున, రామాంజినేయులుకు దెబ్బలు తగలకున్నా దెబ్బలు తగిలాయంటూ ప్రభుత్వాస్పత్రిలో చేరారని తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన వెంకట్రామిరెడ్డి, శశిధర్‌రెడ్డి, హన్మంత రెడ్డి, వివేకానందరెడ్డి, మంజునాథ్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, నరసింహరెడ్డి, కొండారెడ్డి, చెన్నారెడ్డి, నరేష్ కుమార్‌రెడ్డిలతో పాటు మరి కొంతమందిపై కేసు కట్టారు. వీరిలో ఆరోజు ఎవరూ కుడా ఘటలో పాల్గొనకున్నా పోలీసులు కేసు నమోదు చేయడం గమన్హారం.
కానిస్టేబుల్‌పై దాడి ఘటనలో 16మందిపై కేసు
ఈ ఘటనలో గాయపడిన పోలీస్ కానిస్టేబుల్ జయచంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు ఇరు పార్టీలకు చెందిన 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో మిడతల శీనయ్య, శీనా, ఉజ్జినయ్య, డీలర్ మల్లికార్జున, గురవ మల్లికార్జున, మల్లప్ప, ఈశ్వరయ్య, మంజునాథ్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, హరినాథ్‌రెడ్డి, పుల్లారెడ్డి, మధు, మిషన్ కొండారెడ్డి, లక్ష్మీదేవి, భాగ్యమ్మ, సింహాద్రిలతో పాటు మరి కొంతమంది ఉన్నారు.
ధర్మవరపు మురళి పేరు తొలగింపు
టీడీపీ నేతలు కొట్టిన దెబ్బలకు గాయపడి అనంతపురంలో చికిత్స పొందుతున్న బాధితులు హన్మంతరెడ్డి, పద్మావతి, నాగరత్నమ్మలు తమను గ్రామస్తులతో పాటు మంత్రి సోదరుడు ధర్మవరపు మురళి, పరిటాల శ్రీరామ్ అనుచరులు వచ్చి దాడి చేశారని, ధర్మవరపు మురళినే కొట్టించాడని, అతన్ని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు చేశారు. ధర్మవరపు మురళి తన కాన్వాయ్‌తో వచ్చి బా«ధితులపై రాళ్లు రువ్విన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పలు మీడియా చానళ్లలో కూడా ధర్మవరపు మురళి రాళ్లు రువ్విన దృశ్యాలను పదే పదే చూపిస్తున్నా పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఆయన మంత్రి పరిటాల సునీత సొదరుడు కాబట్టి. ధర్మవరపు మురళిని అరెస్ట్ చేస్తే తమ ఉద్యోగాలు ఊడిపోతాయన్నది పోలీసుల భయం. ధర్మవరపు మురళితో పాటు మండల వ్యాప్తంగా పలువురు టీడీపీ నాయకులు ఈ ఘటనలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వీడియోలను చూస్తే పాల్గొన్నదెవరో పోలీసులకే తెలుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment