సైబర్‌ నేరగాళ్లకు ముకుతాడు | Police Implementing Strategic Plans Regarding Cyber Crimes | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరగాళ్లకు ముకుతాడు

Published Mon, Feb 10 2020 1:41 PM | Last Updated on Mon, Feb 10 2020 1:43 PM

Police Implementing Strategic Plans Regarding Cyber Crimes - Sakshi

సాక్షి, రంగారెడ్డి: 2017లో 325.. 2018లో 428.. 2019లో 1393.. ఈ ఏడాది తొలి నెలలోనే 200కుపైగా.. ఆ స్థాయిలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాలను కట్డడి చేయడానికి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఉత్తరాదిన ఉంటూ ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న వారికి చెక్‌ చెప్పడానికి ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రాసిన లేఖకు రాజస్థాన్‌ పోలీసు నుంచి సానుకూల స్పందన వ్యక్తమైంది. మరో మూడు రాష్ట్రాలతోనూ ఈ రకమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి అధికారులు అన్నివిధాలుగా సన్నాహాలు చేస్తున్నారు. 

ఆ మూడు రకాలే అత్యధికం.. 
నగరంలో నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో మూడు రకాలైనవే ఎక్కువగా ఉంటున్నాయి. ఆర్మీ ఉద్యోగులుగా తక్కువ ధరకు వాహనాలు, వస్తువుల పేరుతో యాడ్స్‌ యాప్‌లో పోస్టులు పెట్టి మోసం చేసే ఓఎల్‌ఎక్స్‌ ఫ్రాడ్స్, బ్యాంకు అధికారుల మాదిరిగా ఫోన్లు చేసిన వ్యక్తిగత సమాచారంతో పాటు వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్స్‌ కూడా తీసుకుని ఖాతాలు ఖాళీ చేసే ఓటీపీ మోసాలు, ఉద్యోగులు– వీసా– ఇన్సూరెన్స్‌ బోనస్‌–గిఫ్టŠస్‌–లాటరీల పేరుతో చేసే కాల్‌ సెంటర్‌ ఫ్రాడ్స్‌.. ఈ కేసులే అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. గత ఏడాది మొత్తం రిజిస్టరైన కేసుల్లో 80 శాతానికి పైగా ఈ నేరాలే ఉన్నాయి. ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టులు, అశ్లీలత, డేటా థెఫ్ట్‌ వంటి నేరాలు ఏటా తక్కువ సంఖ్యలో నమోదవుతుంటాయి.  

కనిపించకుండానే ఖాతా ఖాళీ... 
నగరంలో నమోదవుతున్న సైబర్‌ నేరాల్లో బయటి రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువగా నిందితులుగా ఉంటున్నారు. ఓఎల్‌ఎక్స్‌ నేరగాళ్లకు రాజస్థాన్‌లోని మేవాట్‌ రీజియన్‌లో ఉన్న ఆల్వార్, భరత్‌పూర్‌.. ఓటీపీ ఫ్రాడ్‌స్టర్స్‌కు ఝార్ఖండ్‌లోని జామ్‌తార, దేవ్‌ఘర్, గిరిధ్‌... కాల్‌ సెంటర్ల కేంద్రంగా నడిచే ఇతర నేరాలు చేసే వారికి ఢిల్లీ అడ్డాలుగా మారాయి. ఈ సైబర్‌ నేరాల్లో నిందితులు బాధితులకు కనిపించరు. కేవలం ఫోన్‌ కాల్స్‌ ఆధారంగానే వీళ్లు తమ పని పూర్తి చేసుకుంటున్నారు. ఒక్కోసారి ‘వినిపించకుండా’నూ అందినకాడికి దండుకుంటున్నారు. ఈ తరహా సైబర్‌ నేరాలు చేసే వాళ్లు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న చిత్తరంజన్, అసన్‌సోల్‌లకు చెందిన వారి బ్యాంకు ఖాతాలు వాడుకుంటున్నారు.  

అక్కడంతా జెంటిల్మెన్స్‌గానే... 
‘ఈ– నేరగాళ్ల’పై హైదరాబాద్‌ సహా దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నా.. వారి స్వస్థలాల్లో మాత్రం ఎలాంటి నేరాలు చేయట్లేదు. ఈ– సైబర్‌ క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి రాజధానిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసుల మినహా దక్షిణాది నుంచి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించరు. ఇక్కడ టీమ్స్‌ వెళ్లి వరుస దాడులు చేస్తున్నా.. సూత్రధారులు తప్పించుకుని కేవలం పాత్రధారులు మాత్రమే చిక్కుతున్నారు. దీంతో కీలక నిందితులు మరొకరిని టార్గెట్‌గా చేసుకుని రెచి్చపోతున్నారు. మరోపక్క స్థానికంగా ఉన్న పోలీసులకు వీరికి ‘అవగాహన’ సైతం ఉంటోంది. ఫలితంగా దాడి చేయడానికి బయటి పోలీసులు వస్తున్న సమాచారం వారికి ముందే చేరి తప్పించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతోంది.  

అక్కడి పోలీసులకు లేఖలు... 
సైబర్‌ నేరాల కట్టడి విషయంలో కేసు నమోదు చేసి, నిందితుల్ని అరెస్టు చేయడం కంటే.. అసలు నేరగాళ్లు నేరం చేసే ఆస్కారం ఇవ్వకుండా ఉండటమే ఉత్తమమని సిటీ సైబర్‌ క్రైమ్‌ అధికారులు నిర్ణయించారు. ఈ నేరాల్లో నగదు పోవడం ఎంత తేలికో.. రికవరీలు అంతకష్టం. ఈ పరిస్థితుల్ని మార్చాలంటే ఈ నేరగాళ్ల వ్యవహారం అక్కడి పోలీసులకు తెలపడంతో పాటు వారిని అధికారికంగా సంప్రదించి ముందుకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు.

ఈ మేరకు ఉన్నతాధికారుల ద్వారా రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఢిల్లీ పోలీసులకు లేఖలు రాస్తున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌ అధికారుల నుంచి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సానుకూల స్పందన వచి్చంది. త్వరలో మిగిలిన మూడు రాష్ట్రాలతోనూ సంప్రదింపులు పూర్తి చేయనున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement