
ప్రధాన నిందితుడు మారుతీ రావు, ఇతర నిందితులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/నల్లగొండ క్రైమ్: షెడ్యూల్డ్ కులానికి చెందిన యువకుడు పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ1) తిరునగరు మారుతీరావే అని తేలింది. తన కూతురు అమృత వర్షిణిని కులాంతర వివాహం చేసుకున్నాడని పగ పెంచుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు వెల్లడైంది. ఈ నెల 14న నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న వారం దరినీ అరెస్టు చేసి మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ప్రణయ్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ ఏవీ రంగనాథ్ మీడియాకు వివరించారు.
‘పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుతో సంబంధం ఉన్న వారందరినీ అరెస్టు చేశాం. ఈ ఏడాది జనవరిలో ప్రణయ్, అమృతల వివాహంహైదరాబాద్ ఆర్య సమాజ్‌లో జరిగింది. వివాహం తరువాత తన కూతురిని అప్పగించాలని ప్రణయ్ కుటుంబ సభ్యులపై అనేక రకాలుగా మారుతీరావు ఒత్తిడి తెచ్చాడు. అయినా ఫలితం లేకపోవడంతో ప్రణయ్‌ని అడ్డుతొలగించి అమృతను ఇంటికి తెచ్చుకోవాలని పధకం వేసుకున్నాడు. మిర్యాలగూడకు చెందిన తన స్నేహితుడు అబ్దుల్ కరీంతో ప్రణయ్ హత్య గురించి చర్చించాడు. గతంలో ఓ భూ వివాదంలో తనకు పరిచయమైన మాజీ ఉగ్రవాది అబ్దుల్ బారీని జూలైలో సంప్రదించి హత్య చేయాలని కోరారు. ఇదే విషయమై కరీంను హైదరాబాద్‌లో ఉంటున్న అబ్దుల్ బారీ వద్దకు పంపించాడు.
రూ.కోటి ఒప్పందం...
మాజీ ఉగ్రవాదులు అస్గర్ అలీ, అబ్దుల్ బారీ మిర్యాలగూడకు వచ్చి మారుతీరావు, కరీంను కలసి ప్రణయ్‌ని హత్య చేయడానికి రూ.కోటి ఒప్పందం కుదుర్చుకున్నారు. జూలై 2వ వారంలో రూ.15 లక్షలను కరీంకు ఇచ్చి బారీకి అందజేయాల్సిందిగా తన కారులోనే డ్రైవరు శివతో పంపించాడు. గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో రాజమండ్రి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో బారీకి బిహార్‌కు చెందిన సుభాశ్‌కుమార్ అలియాస్ శర్మ పరిచయమయ్యాడు. ప్రణయ్ హత్య కోసం సుభాశ్‌ను అక్కడి నుంచి పిలిపించాడు. వీరు మాజీ ఉగ్రవాది అస్గర్‌అలీతో కలసి హత్యకు ప్లాన్ వేశారు.
పలుమార్లు రెక్కి...
ప్రణయ్ హత్య కోసం అస్గర్‌అలీ, బారీ అతన్ని నివాసాన్ని పరిశీలించారు. ఆగస్టు 22న ఇంటి వద్దనే ప్రణయ్‌ని హత్య చేయడానికి ప్రయత్నించగా సాధ్యం కాలేదు. అమృత గర్భవతి అని తెలియడం, ప్రణయ్ కుటుంబం రిసెప్షన్ ఏర్పాటు చేయడంతో పరువు పోయిందని భావించిన మారుతీరావు.. ప్రణయ్‌ని త్వరగా కడతేర్చాలని ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో ప్రణయ్ ఇంటికి వెళ్లి కారు కిరాయికి కావాలని అతని తండ్రి బాలస్వామిని సుభాష్ అడిగాడు. ఆ రోజే హత్య చేయాలని అనుకున్నా.. వీలు కాలేదు. దీంతో అమృతను, ప్రణయ్‌ని కిడ్నాప్ చేయాలని, అతన్ని హత్య చేసి అమ్మాయిని ఆమె తండ్రికి అప్పగించాలని రెక్కీ నిర్వహించారు. అదీ సాధ్యం కాలేదు. తర్వాత అమృత వెళ్లే బ్యూటీపార్లర్ వద్ద హత్యకు ప్లాన్ చేశారు. అక్కడికి అమృత, ప్రణయ్‌తోపాటు అతని సోదరుడు కూడా రావడంతో ఇద్దరిలో ఎవరిని చంపాలో గుర్తించడం కష్టమై విరమించుకున్నారు.
అమృత తల్లి ద్వారా కదలికలు తెలుసుకుని...
అమృత గర్భవతి కావడంతో ఆ విషయాన్ని తన తల్లికి చెప్పింది. జ్యోతి ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం వెళుతున్నట్లు తెలియజేసింది. ఆ విషయాన్ని తన భార్య ద్వారా తెలుసుకున్న మారుతీరావు బారీకి వివరించాడు. ప్రతి వారం వారు ఆస్పత్రికి వస్తున్నట్లు గుర్తించిన నిందితులు ప్రణయ్‌ను అక్కడే హత్య చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 14న అజ్గర్ అలీ, సుభాష్ శర్మ ఆస్పత్రి వద్ద కాపు కాశారు. ఆస్పత్రి నుంచి బయటికి వస్తుండగా సుభాష్ కత్తితో వెళ్లి ప్రణయ్‌ను నరికి చంపాడు. స్కూటీతో రెడీగా ఉన్న అస్గర్‌తో కలసి అక్కడి నుంచి పారిపోయాడు. మిర్యాలగూడ శివారులో శర్మ తన దుస్తులను మార్చుకున్నాడు. తరువాత త్రిపురారం మీదుగా, సాగర్–నల్లగొండ మార్గంలో నల్లగొండకు చేరుకున్నాడు. అక్కడి నుంచి హైదరాబాద్ మీదుగా బెంగుళూరుకు వెళ్లి చివరికి పట్నాకు పారిపోయాడు. అస్గర్ అలీ చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్‌కు చేరకున్నాడు. చౌటుప్పల్ దాటుతున్న సమయంలో అబ్దుల్ బారీకి ఫోన్‌చేసి పని పూర్తయిందని, డబ్బులు ఇవ్వాలని కోరాడు. వెంటనే బారీ మారుతీరావుకు విషయం తెలిపాడు.
‘దృశ్యం’ను అనుసరించిన మారుతీరావు...
మిర్యాలగూడలో ప్రణయ్‌ని హత్య చేసిన రోజున.. తానక్కడ లేనని రుజువు చేసుకునేందుకు మారుతీరావు దృశ్యం సినిమాను అనుసరించి ఎలిబీ(సాక్ష్యం) సృష్టించుకునే ప్రయత్నం చేశాడు. నల్లగొండ కలెక్టరేట్‌లో పని ఉందని జేసీని కలిసేందుకు వచ్చాడు. దారిలో వేములపల్లి వద్ద మిర్యాలగూడ డీఎస్పీ, స్థానిక ఎస్‌ఐ కనిపిస్తే అవసరం లేకున్నా వాహనం దిగి వారికి కనిపించాడు.
రాజకీయాలకు సంబంధం లేదు..
ఈ హత్యోదంతంతో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సహా రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధమూ లేదు. అడ్వకేట్ సోమ భరత్ వారిని బెదిరించినట్లు విచారణలో తేలలేదు. అమృత గర్భం దాల్చడంతో మారుతీరావుకు బంధువు కూడా అయిన భరత్.. చిన్న వయస్సులో పిల్లలు ఎందుకు, ఇంకా కొంతకాలం ఆగిన తర్వాత ప్లాన్ చేసుకోండి, అని మాట్లాడినట్లు తేలింది. వీరేశం కూడా పెళ్లి విషయంలో బాలస్వామి, ఆయన సోదరడు జోజితో మాట్లాడినట్లు చెబుతున్నారు. తన కూతురుకు అబార్షన్ చేయాలని మారుతీరావు డాక్టర్ జ్యోతిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చినా ఆమె అంగీకరించలేదు.
9వ తరగతి నుంచే ప్రేమ...
అమృత, ప్రణయ్ 9వ తరగతి నుంచే స్నేహితులు. అమృత 9వ తరగతిలో ఉండగా ప్రణయ్ 10వ తరగతిలో ఉన్నాడు. ఇంటర్ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయం మారుతీరావు, సోదరుడు శ్రవణ్‌కుమార్‌కు తెలిసింది. తమ కూతురుతో తిరగవద్దని ప్రణయ్‌ను, అతని కుటుంబ సభ్యులను బెదిరించారు. అయినా అమృత, ప్రణయ్ కలుస్తుండటంతో ఇంటర్ తర్వాత ఒక ఏడాది ఖాళీగా ఇంట్లోనే ఉంచారు. అనంతరం హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్పించారు. అదే సమయంలో ఘట్‌కేసర్ శ్రీనిధి కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న ప్రణయ్‌తో సంబంధాలు పెరిగాయి. వారిద్దరూ నిత్యం మాట్లాడుకుంటున్నారని మారుతీరావుకి తెలిసింది. దీంతో అమృత చదువు మానిపించి ఇంటి వద్ద ఉంచారు. ఫోన్‌లో ఇరువురి మధ్య చాటింగ్ గమనించిన అమృత బాబాయ్ శ్రవణ్ ఆమెపై చేయి చేసుకున్నాడు. మరోసారి ప్రణయ్ తల్లిదండ్రులను మారుతీరావు పిలిచి అదుపులో ఉంచుకోవాలని భయబ్రాంతులకు గురిచేశాడు. ఆ తర్వాత అమృత, ప్రణయ్ వాళ్ల ఇంట్లోవాళ్లకు చెప్పకుండా హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు.
అదనపు ఎస్పీ నేతృత్వంలో విచారణ
మాజీ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టడంలో విఫలమైన తీరుపై నిజానిజాలు తెలుసుకునేందుకు అదనపు ఎస్పీ నేతృత్వంలో విచారణ కమిటీని వేశామని ఎస్పీ రంగనాథ్ చెప్పారు. ఐఎస్‌ఐ ఉగ్రవాదులుగా గుజరాత్ మాజీ హోం మంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో శిక్ష కూడా అనుభవించిన అస్గర్ అలీ, అబ్దుల్ బారీ కదళికలపై నిఘా పెట్టకపోవడం, వారు స్వేచ్ఛగా తిరుగుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయినా గుర్తించలేకపోవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. అలాగే మారుతీరావు భూ కబ్జాలు, తదితర నేరాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరుపుతామని, ఈ విషయంలో ఇప్పటికే కలెక్టర్‌కు సమాచారం కూడా ఇచ్చామని ఎస్పీ తెలిపారు.
ఈ కేసుతో నయీం పేరును లింకు చేస్తున్నారని, అసలు నయీం లేనప్పుడు అతని గ్యాంగ్ ఎక్కడిదని ప్రశ్నించారు. అస్గర్ అలీ, నయీంలకు సంబంధం కూడా లేదని ఎస్పీ చెప్పారు. కాగా సుభాష్‌కుమార్‌ను బిహార్ పోలీసులు అరెస్టు చేశారని, కోర్టు అనుమతితో అక్కడి నుంచి రాష్ట్రానికి తీసుకువస్తున్నామని చెప్పారు. ప్రణయ్ హత్య కేసులో నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీసులను ఎస్పీ అభినందించారు. మారుతీరావు పోలీసులకు లొంగిపోగా, మిగిలిన ఆరుగురిని వివిధ ప్రాంతాల్లో మిర్యాలగూడ డీఎస్పీ, సీఐలు ధనుంజయ, భాష, క్యాస్ట్రోరెడ్డి, వేణు అరెస్ట్ చేశారు.
నిందితులు వీరే..
ఏ.1 మారుతీరావు (అమృత తండ్రి)
ఏ.2 శర్మ (చంపిన వ్యక్తి)
ఏ.3 : అస్గర్‌అలీ
ఏ.4 అబ్దుల్ బారీ
ఏ.5 కరీం
ఏ.6. శ్రవణ్ (అమృత బాబాయి)
ఏ.7. శివ (కారుడ్రైవర్)
.....................
ఆస్తులపై విచారణ...
కిరోసిన్ వ్యాపారం చేసిన మారుతీరావు ఆస్తులపై విచారణ చేస్తామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మారుతీరావు భూ దందాలు, ఆస్తులపైన కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోందన్నారు. భూములు క్రయవిక్రయాలతో పాటు అక్రమ వ్యాపారాలపైన సమాచారాన్ని సేకరించామన్నారు.
అస్గర్, బారీలకు ఉగ్రవాద మూలాలు(బాక్స్)
నల్లగొండ క్రైం: ప్రణయ్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితుల్లో అబ్దుల్ బారీ, అస్గర్ అలీలకు ఉగ్రవాద మూలాలు ఉన్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థ నిర్వహించిన శిక్షణలో పాల్గొని నల్లగొండ జిల్లాలో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు పూనుకున్నారు. 10వ తరగతి చదివిన అస్గర్ అలీ తొలుత చిన్నచిన్న దొంగతనాలు చేసేవాడు. క్రమంగా ఉగ్రవాద కార్యక్రమాలకు ఆకర్షితుడై.. నల్లగొండకు చెందిన షేక్ ఫరీద్, షేక్ అవద్, అబ్ధుల్‌బారీ, షేక్ ఒబైద్‌లను ఉగ్రవాద కార్యకలాపాల వైపు మొగ్గేలా చేశాడు. అనంతరం బారీ, షీఫీ, ఇంతియాజ్, నూర్ రెహ్మాన్‌లతో కలసి 2003లో గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో 2003, ఏప్రిల్ 16న అస్గర్ అలీ, రవూఫ్ (సైదాబాద్), సయ్యద్ ఇప్తేఖర్ (టోలీచౌకి–హైదరాబాద్), అబ్దుల్ బారీ, షఫీ (నల్లగొండ)లను సీబీఐ హైదరాబాద్‌లో అరెస్టు చేసింది. 2013, అక్టోబర్ 16న బెయిల్‌పై జైలు నుంచి బయటికి వచ్చారు. అస్గర్ అలీపై మొత్తం 14 కేసులు ఉన్నాయి. బారీ కూడా నల్లగొండకు చెందిన పలువురు ముస్లిం యువకులను ఉగ్రవాదం వైపు ప్రేరేపించాడు. వీరంతా తారీఖ్ ముస్లీం షబాక్ (టీఎంఎస్) అనే మత చాందసవాద సంస్థలో పనిచేశారు. అమృత తండ్రి మారుతీరావు భూ వివాదంలో జోక్యం చేసుకొని బెదిరించడంతో 2011లో మిర్యాలగూడ పోలీస్‌స్టేషన్‌లో బారీపై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. జిల్లా మొత్తంలో అతడిపై 9 కేసులున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment