మేదరమెట్లలోని గుట్కా తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ (ఫైల్)
సాక్షి, ఒంగోలు : గుట్కా రాకెట్ కేసులో తీగ లాగుతున్న పోలీసులు ఆ డొంక కదిల్చే ప్రయత్నంలో కొంత వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని మేదరమెట్ల, నెల్లూరు నగరాల్లో గుట్కా తయారీ కేంద్రాలపై దాడులు చేసిన పోలీసులు పాత్రదారులపై కేసులు నమోదు చేసి సూత్రధారులను తప్పించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుట్కా మాఫియా నోరు విప్పితే వారికి అండగా నిలిచి భారీ మొత్తంలో మామూళ్లు పుచ్చుకున్న ఇంటి దొంగల పాత్ర బయటపడుతుందనే ఆందోళనతో ముగ్గురు టీడీపీ నేతలను కేసు నుంచి బయట పడేసేందుకు ఓ అధికారి పావులు కదుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అసలు విషయం పోలీస్ ఉన్నతాధికారులకు చెప్పకుండా తప్పుడు సమాచారం చేరవేస్తున్నట్లు తెలుస్తోంది. గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు నుంచి ఎన్నికల సమయం వరకూ అక్కడ పనిచేసిన ఓ ఎస్సై సదరు పోలీస్ అధికారికి దగ్గరి బంధువు కావడంతో వీరి బాగోతం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మేదరమెట్ల గ్రామంలో గుట్కా మాఫియా సూత్రధారుల గురించి ప్రస్తావిస్తే నలుగురు టీడీపీ నేతల పేర్లను చెప్పేస్తున్నారు. అయినప్పటికీ ఇంటి దొంగల గుట్టు బయట పడుతుందేమోననే భయంతో పోలీసులు మాత్రం వారి జోలికి వెళ్లడం లేదు. కేసు విచారణలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్న పోలీసులు ఇంటి దొంగలను రక్షంచేందుకు మాత్రం విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమార్కులకు పోలీసుల
అండదండలు...
కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని ఓ పొగాకు గోడౌన్‌లో మూడేళ్లుగా నడుస్తున్న గుట్కా మాఫియా గుట్టును రట్టుచేసిన పోలీసులు కేంద్రం నిర్వాహకుడైన నెల్లూరుకు చెందిన బలగాని ప్రసాద్‌తో పాటు గోడౌన్ యజమాని హనుమంతరావు (బుల్లబ్బాయ్)పై కేసు నమోదు చేశారు. హనుమంతరావును అరెస్ట్ చేసిన పోలీసులు ప్రసాద్ కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా తీగ లాగుతూ వెళ్లిన పోలీసులకు నెల్లూరు నగరంలో మరో గుట్కా తయారీ కేంద్రం కంటబడింది. నిందితుడు ప్రసాద్ మాత్రం పరారీలో ఉన్నాడు. అసలు నిందితుడు దొరికితే సూత్రధారులైన టీడీపీ నేతలు, అండగా నిలిచిన పోలీస్ అధికారుల పాత్ర బయట పడే అవకాశం ఉంది. టీడీపీ ఎమ్మెల్యేతో దగ్గరగా ఉండే మార్కెట్‌యార్డు మాజీ వైస్ చైర్మన్‌తో పాటు హనుమంతరావు (బుల్లబ్బాయ్), గ్రామానికి చెందిన మరో ఇద్దరు టీడీపీ నేతల భాగస్వామ్యంతో గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అప్పట్లో అక్కడ పనిచేసిన ఎస్సైతో పాటు మరి కొందరు పోలీస్ అధికారులకు సైతం తెలిసే గుట్కా తయారీ కేంద్రం ఏర్పాటైనట్లు సమాచారం. అప్పట్లో నెలకు రూ.2 లక్షల చొప్పున పోలీసులకు మామూళ్లు ముట్టజెప్పి అక్రమ వ్యాపారాన్ని అధికారికంగా నిర్వహిస్తూ వచ్చారు. అప్పట్లో ఓ హెడ్ కానిస్టేబుల్ ద్వారా ఎస్సై నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు నెలవారీ మామూళ్లు ఇస్తూ హనుమంతరావుకు చెందిన గోడౌన్‌లో గుట్టుగా గుట్కా తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తూ వచ్చారు. రాత్రి వేళల్లో గుట్కాను ఇతర ప్రాంతాలకు అక్రమ రవాణా చేసేందుకు కూడా అప్పట్లో పనిచేసిన పోలీస్ అధికారులు వీరికి పూర్తి స్థాయిలో అండదండలు అందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంటి దొంగలను రక్షించేందుకే...
గుట్కా తయారీ కేంద్రానికి వచ్చి రూ.3 కోట్ల విలువ చేసే యంత్రాలు, తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులకు తీగ లాగేకొద్దీ గతంలో కొందరు ఖాకీలు చేసిన పాపాలు బయటపడుతూ వచ్చాయి. కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకూ అందరికీ నెలవారీ మామూళ్లు ఇచ్చారనేది బహిరంగ రహస్యమే. విచారణ అధికారులు, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తూ కేసు నుంచి టీడీపీ నేతలను తప్పించేందుకు ఓ పోలీసు అధికారి ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment