
నాగ పవన్ కళ్యాణ్..(అల్ఫాతుల్లా ) మృతదేహం
ఒంగోలు, కొత్తపట్నం : సముద్ర స్నానం చేస్తున్న ఇద్దరు విద్యార్థులను కెరటాలు కాటేశాయి. మృతుల్లో ఒకరు పాలిటెక్నిక్ విద్యార్థికాగా మరొకరు ఇంటర్ విద్యార్థి. ఈ సంఘటన కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం బీచ్‌లో గురువారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ వి.ఆంజనేయులు కథనం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఒంగోలు నుంచి తొమ్మిది మంది విద్యార్థులు సముంద్ర స్నానం చేసేందుకు బైకులపై వచ్చారు. తమ స్నేహితుడు రంగాయపాలెంలో ఉంటున్న షేక్ అల్ఫాతుల్లా ఇంటికి వెళ్లి అతడిని నిద్ర లేపుకుని అందరూ కె.పల్లెపాలెం బీచ్‌కు వెళ్లారు. బీచ్ ఆవరణలో కొద్దిసేపు బైకులపై సరదాగా తిరిగారు. బైకులు సముద్రపు ఒడ్డున ఉంచారు. షేక్ అల్ఫాతుల్లా (17), దాలా నాగపవన్‌కాళ్యాణ్ (17), మరో విద్యార్థి దుస్తులు ఒడ్డున పెట్టి సరదాగా సముద్ర స్నాçనం చేస్తున్నారు. అల్ఫాతుల్లా లోతుకు వెళ్లడం..మళ్లీ ఒడ్డుకు రావడం చేస్తున్నాడు. మరింత లోతుకు వెళ్లి స్నానం చేస్తుండగా అలలు తీవ్రతకు గల్లంతయ్యాడు. ఆ పక్కనే సముద్ర స్నానం చేస్తున్న నాగపవన్ కాళ్యాణ్ (17) కూడా అలలు తాకిడికి గల్లంతయ్యాడు.
మూడో యువకుడు పరుగు తీసి ఒడ్డుకు చేరాడు. అల్ఫాతుల్లా, నాగపవన్‌కళ్యాణ్‌లు చేతులు పైకి ఎత్తి సముద్రంలో కొట్టుకుపోయారు. ఒడ్డునే ఉన్న స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. ఆ సమయంలో మత్స్యకారులు ఎవరూ లేకపోవడంతో కాపాడలేకపోయారు. కొద్దిసేపటి తర్వాత మత్స్యకారులు వచ్చి అలల మధ్యలో కనిపిస్తున్న అల్ఫాతుల్లాను అతికష్టం మీద ఒడ్డుకు చేర్చారు. ఆ సమయంలో కుటుంబ సమేతంగా సరదా గడిపేందుకు సముద్రానికి వచ్చిన ఓ ఎస్‌ఐ అల్ఫాతుల్లాకు సపర్యలు చేసి బతికించే ప్రయత్నం చేశారు. కడుపు నిండా ఉప్పునీరు ఉండటంతో అపస్మారక స్థితికి చేరుకొని మృతి చెందాడు.మృతుడి తల్లి సుబ్బాయమ్మ,తండ్రి రహంతుల్లా, సోదరి, బంధువులు వచ్చి భోరున విలపించారు. తల్లిదండ్రులకు అల్ఫాతుల్లా ఒక్కడే కుమారుడు. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. అల్ఫాతుల్లా పేస్ కాలేజీలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
కొట్టుకొచ్చిన మరో విద్యార్థి మృతదేహం
సంఘటన స్థలానికి ఎస్సై వి.ఆంజనేయులు తన సిబ్భందితో వచ్చి నాగపవన్ కాళ్యాణ్ ఆచూకీ కోసం ఐలా వలతో అలల మధ్య గాలింపు చర్యలు చేపట్టారు. అతడి తండ్రి శ్రీనివాసరావు, బంధువులు సముద్ర తీరానికి వచ్చి బిడ్డ రాక కోసం ఎదురు చూశారు. సాయంత్రం సమయంలో నాగ పవన్‌కళ్యాణ్ మృతదేహం కృష్ణా హేచరీ సమీపానికి కొట్టుకొచ్చింది. యువకుడి కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనంతరం ఆ మృతదేహాన్ని కూడా రిమ్స్‌కు తరలించారు. తల్లిదండ్రులకు పవన్‌కళ్యాణ్ ఒక్కడే కుమారుడు, ముగ్గురు కుమర్తెలు ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఒంగోలు రెండో పట్టణ సీఐ ఎస్. సురేష్‌కుమార్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల తల్లిదండ్రులను ఓదార్చారు. మృతుడు ఒంగోలు ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
అంతా శారదా బాలకుటీర్ పూర్వ విద్యార్థులు
స్నేహితులంతా ఒంగోలులోని శారదా బాలకుటీర్ పూర్వ విద్యార్థులు. 2014–15 సంవత్సరం పదో తరగతి బ్యాచ్. దసరా సెలల్లో కొత్తపట్నం బీచ్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలని పది రోజుల క్రితం నిర్ణయించుకున్నారు. వారు వివిధ కాలేజీల్లో ఇంటర్ చదువుతున్నారు.