![Pregnant Women Died By Touching Fencing Which Passing Current In Nirmal - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/27/Pregnant-Lady.jpg.webp?itok=8ISq4h-9)
సాక్షి, నిర్మల్ : మండలంలోని కిషన్‌రావుపేట గ్రామపంచాయతీ పరిధిలోని చెరువుముందు తండాకు చెందిన రాథోడ్ లావణ్య (22), గజానంద్‌కు ఏడాదిన్నర కిందట పెళ్లైంది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి. వ్యవసాయ కుటుంబం కావడంతో లావణ్య వ్యవసాయ పనులు చూస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. బుధవారం గ్రామ శివారులోని తమ పంట చేనులోకి బుధవారం ఉదయం 10 గంటలకు లావణ్య తన మామతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లింది. పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తుండగా దారిలో కాల్వ ఉండటంతో పక్కనే వ్యవసాయ పంట చేనులోని గట్టు నుంచి వెళ్తుండగా ఇదే గ్రామానికి చెందిన చౌహాన్ గోపి అనే రైతు మొక్కజొన్న పంట చేనుకు రక్షణగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేశాడు. ఆ వైపుగా వచ్చిన లావణ్య గమనించక విద్యుత్ వైర్లను తగలగంతో అక్కడికక్కడే మృతి చెందింది.
పంటచేను వద్దే ఉందనుకున్న భర్త...
బుధవారం రాత్రి వర్షం ఉండటంతో లావణ్య పంటచేనులోనే ఉందని భర్త గజానంద్ భావించాడు. గురువారం ఉదయం పంటచేనుకు వెళ్లి తన తండ్రిని తెలుసుకోగా బుధవారం సాయంత్రమే కోడలు ఇంటికి వెళ్లిందని తెలిపాడు. దీంతో లావణ్య కోసం వెతకడం ప్రారంభించగా మృతిచెంది విగతజీవిగా కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి ఎస్సై ఆసీఫ్‌అలీ చేరుకుని వివరాలు సేకరించారు. తహసీల్దార్ శివప్రసాద్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. సీఐ రమేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఎనిమిది నెలల గర్భిణీ..
లావణ్య గజానంద్‌కు పెళ్లై ఏడాదిన్నర అవుతుంది. లావణ్య ఎనిమిది నెలల గర్భిణీ. మరో నెల రోజుల్లో ఆ ఇంట్లోకి ఓ చిన్నారి రానుందనే ఆనందంలో ఆ కుటుంబం ఉంది. ఇంతలో విద్యుత్ తీగలు వారి ఆనందాన్ని చిదిమేశాయి. దీంతో చెరువుముందుతండాలో విషాదచాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment