మైనర్‌ బాలికలను వ్యభిచార రొంపిలోకి.. | Prostitute Scandal Team Arrest in PSR Nellore | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలికలను వ్యభిచార రొంపిలోకి..

Published Fri, Dec 28 2018 1:23 PM | Last Updated on Fri, Dec 28 2018 1:23 PM

Prostitute Scandal Team Arrest in PSR Nellore - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): మైనర్‌ బాలికలను వ్యభిచార కూపంలోకి దించుతున్న ఓ ముఠాను గురువారం వేదాయపాళెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్న పలువురు మహిళలు యువకులను చేరదీసి వారి ద్వారా ప్రేమపేరిట మైనర్‌ బాలికలకు, యువతులకు ఎరవేస్తున్నారు. అనంతరం వారిని నగ్నంగా ఫొటోలు తీసి వాటి ఆధారంగా వ్యభిచారకూపంలోకి దించి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. గత కొంతకాలంగా నెల్లూరు నగరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతోన్న ఈ తతంగం ఇటీవల ఓ మైనర్‌ బాలిక వివాహాన్ని అడ్డుకొనే క్రమంలో వెలుగులోకి వచ్చింది.

గుట్టుచప్పుడు కాకుండా..
పోలీసుల సమాచారం మేరకు సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన ఓ మైనర్‌ బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించాడు. బాలికను కల్లూరుపల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న దివ్య అనే మహిళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ఆమెను లొంగదీసుకున్నాడు. అక్కడ బాలికకు నగ్నంగా ఫొటోలు తీసి వాటితో దివ్య, ఆ బాలుడు కలిసి ఆమెను బెదిరించి వ్యభిచార కూపంలోకి దించారు. అప్పటి నుంచి దివ్య కొండాయపాలెం నక్కలగుంట ప్రాంతానికి చెందిన మాలతి, గాయత్రినగర్‌కు చెందిన సుమతి, ప్రసాద్‌లతో కలిసి ఆ బాలికతో వ్యభిచారం చేయించేవారు. అయితే బాలిక ప్రవర్తనలో మార్పులను గమనించిన ఆమె తల్లి వివాహం చేసేందుకు నిశ్చయించారు.

బయటపడింది ఇలా..
కుమార్తెకు వివాహం చేస్తే మార్పు వస్తుందన్న ఆలోచనతో తల్లి ఆ బాలికకు తన సమీప బంధువుకు ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించింది. ఈ విషయం తెలుసుకున్న ముఠా ఆ పెళ్లిని ఆపి ఆ బాలికను యథావిధిగా వ్యభిచారంలో కొనసాగించాలని ఎత్తుగడవేసింది. అందులో భాగంగా మైనర్‌ బాలికకు తల్లి బలవంతంగా వివాహం చేస్తోందని ఐసీడీఎస్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఐసీడీఎస్‌ అధికారులు, వేదాయపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. అనంతరం మైనర్‌ బాలికను, ఆమె తల్లిని స్టేషన్‌కు తరలించి విచారించగా ఈ వ్యభిచార ముఠా గుట్టు వెలుగులోకి వచ్చింది. ఈక్రమంలో బాధిత బాలిక తనలాగే చంద్రమౌళినగర్‌కు చెందిన మరో మైనర్‌ బాలికను సైతం ఇలాగే వ్యభిచారకూపంలోకి దించినట్లు తెలిపింది. బాలిక ఇచ్చిన వివరాల మేరకు వేదాయపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ పేరుతో చంద్రమౌళినగర్‌కు చెందిన బాలికను మోసగించిన బాలుడిని, వ్యభిచారకూపంలోకి దించిన దివ్య, సుమతి, మాలతి, ప్రసాద్‌లను గురువారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన బాలిక విషయంలో ఇప్పటికే ఇద్దరు యువకులను వేదాయపాలెం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement