
సాక్షి, రాజమండ్రి: ప్రమాదకరమైన రేడియో ధార్మిక పదార్థం సీఎస్-137 మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. రాజమండ్రిలోని ఓఎన్‌జీసీ బేస్ కాంప్లెక్స్ నుంచి ఈ రేడియో ధార్మిక పదార్థం వారం క్రితం చోరికి గురైంది. దీంతో ఓఎన్‌జీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు కృష్ణా జిల్లా కలిదిండిలోని పాత ఇనుప సామాగ్రి దుకాణంలో ఈ పరికరాన్ని గుర్తించారు. ఈ ఘటనపై రాజమండ్రి అర్బన్ ఎస్పీ షిమోషి మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16వ తేదీన ఓఎన్‌జీసీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. సీఎస్-137 ప్రస్తుతం సేఫ్‌గానే ఉందని వెల్లడించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఓఎన్‌జీసీ సహకారంతో ఈ రేడియో ధార్మిక పరికరాన్ని జాగ్రత్తగా కృష్ణా జిల్లా నుంచి రాజమండ్రికి తరలిస్తామని పేర్కొన్నారు.
ఈ కేసులో నిందితుల వివరాల విచారణ అనంతరం బయటపెడతామని అన్నారు. కాగా ఈ రేడియో ధార్మిక పదార్థం వాతావరణంలో అత్యంత వేగంగా కలిసిపోతుందని, దాని ప్రభావం మనుషులతో పాటు ఇతర జీవులు, వాతావరణంపై కూడా ఉంటుందని రసాయన శాస్త్ర నిపుణులు హెచ్చరించారు. దీంతో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు ఈ కేసు విజయవంతంగా చేధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.