సంఘటనా స్థలంలో నారిశెట్టి సునీల్ కుమార్ మృతదేహం, హత్యకు గురైన సునీల్ కుమార్ (ఫైల్)
భీమవరం టౌన్: భీమవరం పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నారిశెట్టి సునీల్ కుమార్ (33)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంఘటన బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. భీమవరం వన్‌టౌన్ పరిధిలోని బ్యాంక్ కాలనీ శివారు సెయింట్ ఆన్స్ స్కూల్స్ వెనుక ఖాళీ స్థలంలో రక్తపు మడుగులో సునీల్ కుమార్ నిర్జీవంగా కనిపించాడు. హత్యకు వినియోగించిన కత్తి, రెండు ఇనుపరాడ్లు మృత దేహం పక్కనే హంతకులు వదిలివెళ్లారు. సంఘటనా స్థలం వద్ద మద్యం, బీరుసీసాలు, సోడా బాటిళ్లు, చెప్పులు, చిప్స్ ప్యాకెట్లు పడి ఉన్నాయి. ఒక మోటార్ సైకిల్ కూడా ఉంది. మృతుడు తనకు బాగా తెలిసిన వాళ్లతోనే అక్కడ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. తెలిసినవారే పథకం ప్రకారం హత్య చేశారా, బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనే దిశగా పోలీసులు దృష్టి సారించారు. రెస్ట్ హౌస్ రోడ్డుకు చెందిన మృతుడు సునీల్ కుమార్ కొంత కాలం క్రితం కారు డ్రైవర్‌గా పనిచేశాడని ఆ తర్వాత నెమ్మదిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపట్టాడని స్థానికులు చెబుతున్నారు. 2017 మార్చిలో రెస్ట్ హౌస్ రోడ్డుకు చెందిన కోడే వెంకట్ అనే వ్యక్తిని పాత గొడవల నేపథ్యంలో కొందరు వ్యక్తులు పద్మాలయ థియేటర్ వెనుక రోడ్డులో దాడి చేసి హత్య చేశారు.
ఆ కేసులో నిందితునిగా ఉన్న ఒక వ్యక్తితో సునీల్ కుమార్ ఇటీవల సన్నిహితంగా ఉండడం నచ్చని వ్యక్తులు ఎవరైనా ఈ హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి సమీపంలో ఉన్న మరికొన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తే హంతకుల జాడ తెలిసే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు దృష్టిపెట్టారు. సంఘటనపై మృతుడి భార్య నారిశెట్టి మాధవి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్త సునీల్ కుమార్ ఈనెల 8వ తేదీ రాత్రి 7 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారని 10.30 గంటల సమయంలో తాను ఫోన్ చేసి భోజనానికి రమ్మని పిలవగా వస్తానని చెప్పినట్లు మాధవి ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్సై పి.అప్పారావు తెలిపారు. వస్తానన్న భర్త రాకపోవడంతో మళ్లీ ఫోన్ చేస్తే ఎత్తలేదని, 9వ తేదీ తెల్లవారుజామున సెయింట్ ఆన్స్ స్కూల్ వెనుక తన భర్త చనిపోయి ఉన్నట్లు అతని స్నేహితుడు యజ్రా ద్వారా తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా తన భర్త తలపై రాడ్లతో కొట్టి కత్తితో పొడిచి హత్య చేయబడి ఉన్నాడని ఆమె ఫిర్యాదు చేశారని తెలిపారు. తన భర్త సునీల్ కుమార్ 8వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో యజ్రాతో మద్యం తెప్పించుకుని సంఘటనా స్థలంలో రాజు, సాయి అలియాస్ ఆంటీ అనే వాళ్లతో తాగినట్లు తెలిసిందని మాధవి ఫిర్యాదు చేశారని ఎస్సై తెలిపారు. అయితే ఈ కేసులో కొందరు పోలీసులకు లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న భీమవరం పట్టణంలో సునీల్ కుమార్ హత్యతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. సంఘటనా స్థలాన్ని నర్సాపురం డీఎస్పీ టి.ప్రభాకర్‌బాబు పరిశీలించారు.
భీమవరం టూటౌన్, పెనుగొండ సీఐలు ఎ.చంద్రశేఖర్, ఆర్.విజయ్‌కుమార్, భీమవరం వన్‌టౌన్, ఉండి, పాలకొల్లు రూరల్ ఎస్సైలు పి.అప్పారావు, రవివర్మ, విజయ్‌కుమార్‌లు సంఘటనా స్థలం వద్ద విచారణ చేశారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment