టాస్క్‌ఫోర్స్ స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం
చంద్రగిరి (చిత్తూరు జిల్లా): ఎర్రచందనం తరలిస్తున్న స్మగ్లర్లను పట్టుకునేందుకు వెళ్లిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై కూలీలు తిరగబడిన ఘటన చిత్తూరు జిల్లా శేషాచల అటవీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దీంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరపగా.. కూలీలు పరారయ్యారు. వారిని వెంబడించిన పోలీసులు ఒక స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని 6 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు టాస్క్‌ఫోర్స్ బృందం గురువారం రాత్రి శేషాచల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టింది.
ఆ బృందం శుక్రవారం తెల్లవారుజామున మూలపల్లి అటవీ ప్రాంతానికి చేరుకోగా.. పొదల మధ్య నక్కిన కూలీలు స్మగ్లర్లు ఒక్కసారిగా వారిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో వారు ఎర్రచందనం దుంగలను వదిలేసి పారిపోయారు. చీకటిలో వారిని వెంబడించగా ఒక స్మగ్లర్ దొరికాడు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన స్మగ్లర్ తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా జమునమత్తూరు తాలూకా నాచమలై గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యంగా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment