కారులో పూర్ణచంద్రరావు మృతదేహం, ప్రమాదంలో గాయపడి వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
నాయుడుపేటటౌన్: ఆగిఉన్న లారీని కారు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన మండలంలోని పండ్లూరు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా రెట్టచింతల మండలం పాల్వాయి గ్రామానికి చెందిన ఆత్మకూరు పూర్ణచంద్రరావు (55) అతని భార్య నాగలక్ష్మి, సమీప బంధువైన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం బాల్నేపల్లి గ్రామానికి చెందిన పోలిశెట్టి పూర్ణశంకర్, అతని తల్లి రామకోటమ్మ, నర్సారావుపేటకు చెందిన కుక్కర్ల నర్సింహులు, అతని భార్య విజయలు కారు తీసుకుని రెట్టచింతల గ్రామానికి చెందిన పోలిశెట్టి నాగరాజు అనే వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకుని సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పాల్వాయి గ్రామం నుంచి తిరుమలకు బయలుదేరారు.
నెల్లూరుకు వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తుగా ఉందని చెప్పాడు. దీంతో వారు మంగళవారం సాయంత్రం స్వామివారి కల్యాణం ఉందని, దైవదర్శనం చేసుకునేందుకు సమయం ఉందని తొందర పడవద్దని చెప్పి నెల్లూరులో గంటపాటు డ్రైవర్‌ను నిద్రపోమని చెప్పి విశ్రాంతి తీసుకున్నారు. మంగళవారం ఉదయం తిరుమలకు వెళుతుండగా మార్గమధ్యలో మండలంలోని పండ్లూరు వద్ద రోడ్డుపక్కనే నిలబెట్టి ఉన్న లారీని కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో డ్రైవర్ పక్కనే కూర్చుని ఉన్న ఆత్మకూరు పూర్ణచంద్రరావు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. మిగిలిన ఐదుగురురికి గాయాలయ్యాయి. డ్రైవర్‌కు గాయలు కాలేదు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై జి.వేణు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పూర్ణచంద్రరావు మృతదేహానికి స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పోస్ట్‌మార్టం జరిపి కుటుంబసభ్యులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తల్లడిల్లిన కుటుంబసభ్యులు
రోడ్డు ప్రమాదంలో పూర్ణచంద్రరావు మృతిచెందిన విషయం మధ్యాహ్నం వరకు అతని భార్య నాగలక్ష్మీకి తెలియనివ్వలేదు. సమాచారం తెలుసుకుని మృతుడి బంధువులు నాయుడుపేట వైద్యశాల వద్దకు చేరుకోవడంతో ఆమెకు విషయం తెలిసింది. దీంతో ఆమెను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. గాయపడిన వారు కూడా ప్రత్యేక వాహనంలో తరలివెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment