ఖాతాదారులను విచారణ చేస్తున్న పోలీసులు
భువనేశ్వర్: కొందరు దుండగులు తుపాకీ మొనతో బెదిరించి ఆంధ్రాబ్యాంకులో శుక్రవారం దోపిడీకి పాల్పడ్డారు. అనుగుల్ బజార్ ఛక్ ఆంధ్రా బ్యాంకు శాఖలో ఈ దోపిడీ జరిగింది. పట్టపగలు బ్యాంక్ సిబ్బందిని బెదిరించి స్ట్రాంగ్ రూమ్ తెరిపించి భారీగా నగదు, నగలు, ఆభరణాల్ని దోచుకున్నారు. దాదాపు రూ.1 కోటి నగదు దోచుకున్నట్లు భావిస్తున్నారు. దోచుకున్న నగదు, సొత్తు విలువ స్పష్టం కావలసి ఉంది. సమాచారం తెలిసన వెంటనే అనుగుల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌మిత్రభాను మహాపాత్రో ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.
సరిహద్దు మార్గాలకు సీల్
దుండగులు జిల్లా సరిహద్దు దాటిపోకుండా జిల్లా ప్రవేశ మార్గాల్ని సీల్ చేయించి తనిఖీలు ముమ్మరం చేయించినట్లు ఎస్పీ వివరించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ఆధారంగా పోలీసుదళాలు దర్యాప్తు ప్రారంభించాయి. సైంటిఫిక్ దళం కూడా ఘటనాస్థలాన్ని సందర్శించింది. దుండగుల్ని అదుపులోకి తీసుకునేందుకు ఇరుగు పొరుగు జిల్లాలను కూడా అప్రమత్తం చేసినట్లు అనుగుల్ ఎస్పీ మిత్రభాను మహాపాత్రో తెలిపారు. స్థానికంగా విచారణ నిర్వహించి కొంతవరకు వివరాలు సేకరించారు. బ్యాంకు సముదాయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ వ్యవస్థ సరంజామాను పోలీసులు స్వాధీనం చేసుకుని తీసుకుని వెళ్లారు.
ఇదే శాఖలో మూడోసారి దోపిడీ
శుక్రవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో 6గురి నుంచి 7గురు ముసుగు దొంగలు ఈ దోపిడీకి పాల్పడ్డారు. శాఖ ఆవరణలో ఉన్న 30 నుంచి 40 మంది ఖాతాదారులను తొలుత భయపెట్టి బీభత్సం సృష్టించారు. వారి మొబైల్ ఫోన్లు తీసుకుని అందర్నీ ఒకగదిలో పెట్టి తాళం వేశారు. తర్వాత బ్యాంకు సిబ్బందిని బెదిరించి స్ట్రాంగ్ రూమ్‌కు వెళ్లి సర్వం దోచుకున్నారు. బ్యాంకు సిబ్బందిని వేరే గదిలో పెట్టి తాళం వేశారు. దోచుకోవడం పూర్తయిన తర్వాత బ్యాంకు ప్రధాన ప్రవేశ ద్వారం తాళం వేసి బైక్‌లపై శరవేగంగా దూసుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనంగా పోలీసులు పేర్కొన్నారు. ఖాతాదారులకు ఎటువంటి హాని తలపెట్టకున్నా ప్రాణాంతకంగా బెదిరించినట్లు వివరించారు. ఈ శాఖలో ఇటువంటి దోపిడీ సంఘటన వరుసగా ఇది మూడోసారిగా పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment