రౌడీ షీటర్ ప్రేమ్‌కుమార్ (ఫైల్)
గుంటూరు, రేపల్లె: విద్యావంతుల కుటుంబంలో జన్మించాడు. 22 సంవత్సరాల వయస్సులో కత్తి పట్టాడు. అడ్డదారిలో పయనించటంతో అదే కత్తికి బలై జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది.నియోజకవర్గంలోని చెరుకుపల్లి గ్రామానికి చెందిన రౌడీ షీటర్ శెట్టిపల్లి ప్రేమ్‌కుమార్ సోమవారం జిల్లాలోని మాచర్ల పట్టణంలో హత్యకు గురికావడంపై నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. వివరాలను పరిశీలిస్తే..
తండ్రి విశ్రాంత ఎంఈవో
ప్రేమ్‌కుమార్ తండ్రి జయరావ్ ఎంఈవోగా పనిచేసి రిటైర్డ్ అయ్యి అనంతరం మృతి చెందారు. భార్య జోత్స్న వెల్దుర్తు మండలం సిరిగిరిపాడు గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నది. చెల్లెళ్లు విజయలక్ష్మి బాపట్లలో ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నారు. జయలక్ష్మి ప్రస్తుతం విద్యనభ్యశిస్తున్నది. కుటుంబం మొత్తం విద్యావంతులు అయినప్పటికీ ప్రేమ్ అడ్డదారిలో పయనిస్తూ ముందుకు సాగాడు.
ప్రేమ్‌కుమార్ నేర చరిత్ర
♦ 2008, ఏప్రిల్ 5వ తేదీన చెరుకుపల్లి గ్రామంలో నిజాంపట్నం గ్రామానికి చెందిన శీలం నాగేశ్వరరావు(నాగు) హత్య కేసులో ప్రధాన ముద్దాయిగా ప్రేమ్‌కుమార్ పేరు నమోదైంది. ఆ కేసులో జిల్లా కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అనంతరం 2014లో హైకోర్టులో కేసు కొట్టివేశారు.
♦ 2009 మే 28న, 2009 జూన్ 24న రెండు కొట్లాట కేసులలో చెరుకుపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు.
♦ 2009లో చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ నమోదు
♦ నగరం పోలీస్ స్టేషన్‌లో ఆమ్స్ యాక్ట్‌లో షీట్ నమోదు
♦ 2014 జూలై 16న పట్టణంలో జరిగిన రాయల్ శివ హత్య కేసులో ముద్దాయి. కేసులో రాజీ పడటంతో కేసు కొట్టివేత.
ప్రస్తుతం ఎక్కువగా మాచర్లలోనే
రాయల్ శివ హత్య కేసు అనంతరం పట్టణంలో ఎక్కువగా ఉండని పరిస్థితి నెలకొంది. ఎక్కువగా ప్రేమ్‌కుమార్ బాపట్లలోని చెల్లెళ్ల వద్ద, మాచర్ల భార్య వద్ద ఉంటున్నాడని బంధువులు చెబుతున్నారు.
రౌడీ షీటర్ల మధ్య వివాదమే.. అసలు కారణమా..?
నియోజకవర్గంలోని రౌడీ షీటర్ల మధ్య వివాదం నేపథ్యంలోనే ప్రేమ్‌కుమార్ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మాచర్ల పట్టణంలో సీసీ పుటేజీలలో నమోదైన హత్య సంఘటనను రేపల్లె పట్టణ, రూరల్ పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల కాలంలో నియోజకవర్గంలోని కొంత మంది రౌడీ షీటర్లతో ప్రేమ్‌కుమార్ వివాదాలకు దిగినట్లు వస్తున్న సమాచారంతో పోలీసులు ఆ దిశగా విచారణను గోప్యంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది.
Comments
Please login to add a commentAdd a comment