నరసరావుపేట రూరల్: చిలకలూరిపేట రోడ్డులోని ఎస్‌ఆర్‌కేటీ కాలనీకి చెందిన రౌడీషీటర్ షేక్ బాజీ (35) దారుణ హత్యకు గురయ్యాడు. 2021లో జరిగిన హత్యకు ప్రతీకారంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో మహిళ కీలకపాత్ర పోషించినట్టు సమాచారం. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. రౌడీషీటర్ షేక్ బాజీపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. మూడు హత్య కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2021 సెప్టెంబర్ 13న ఎస్‌ఆర్‌కేటీ కాలనీకి చెందిన షేక్ సుభాని హత్య కేసులోనూ ప్రధాన నిందితుడు.
ఈ కేసులో సయ్యద్ పీర్‌వలి ఉరఫ్ అల్లాకసమ్ మరో నిందితుడిగా ఉన్నాడు. వీరిద్దరూ అప్పట్లో అరైస్టె మూడు నెలలు సబ్‌జైలులో ఉన్న అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలో సుభాని తల్లి జాన్‌బీ, ఆమె రెండో కుమారుడు హుస్సేన్, మరికొందరు కలిసి చిత్రాలయ టాకీస్ సెంటర్ సమీపంలో అల్లాకసమ్‌ను అదే ఏడాది డిసెంబర్ 21న హత్యచేశారు. ఈ కేసులో జాన్‌బీతోపాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఐదు నెలలు సబ్‌జైలులో ఉన్న అనంతరం వారు బెయిల్‌పై విడుదలయ్యారు. తన కుమారుడిని హతమార్చిన బాజీ కోసం జాన్‌బీ, ఆమె అనుచరులు నిఘాపెట్టారు. విషయం తెలుసుకొన్న బాజీ కొంతకాలంగా చిలకలూరిపేటలోని తన అత్త ఇంట్లో తలదాచుకుంటున్నాడు.
శపథం చేసి వరుస హత్యలు!
బాజీ అదే కాలనీకి చెందిన జాన్‌బీతో గతంలో సన్నిహితంగా ఉండేవాడు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జాన్‌బీ కుమారుడు సుభానిని బాజీ, అతని స్నేహితుడు అల్లాకసమ్ కలిసి హత్యచేశారు. తన కుమారుడి హత్యకు కారణమైన వారిని వదిలేది లేదని జాన్‌బీ కుమారుడి మృతదేహం వద్ద పోలీసుల సమక్షంలోనే శపథం చేసింది. ఈ క్రమంలోనే తన కుమారుడి హత్యకేసులో ప్రధాన నిందితులు ఇద్దరిని ఒకరి తరువాత మరొకరిని హతమార్చిందని పోలీసులు భావిస్తున్నారు.
పథకం ప్రకారం..
అల్లాకసమ్ హత్య అనంతరం నరసరావుపేట నుంచి తన మకాంను బాజీ చిలకలూరిపేటకు మార్చాడు. కోర్టు వాయిదాలకు రావాలన్నా అనుచరుల రక్షణతో వచ్చి వెళ్తున్నాడు. దీంతో అక్కడ బాజీని హతమార్చడం కష్టమని భావించి రాజీ మార్గం ద్వారా జాన్‌బీ పథకం అమలు చేసినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా కొన్ని రోజులుగా తిరిగి బాజీతో సన్నిహితంగా ఉంటూ హత్యకు పథక రచన చేసినట్టు సమాచారం. మంగళవారం రాత్రి బాజీని ఎస్‌ఆర్‌కేటీ కాలనీకి పిలిపించి ఫూటుగా మద్యం తాగించి.. ఆ తరువాత అతడిపై ఇనుపరాడ్లు, కత్తులతో దాడిచేసి హతమార్చినట్టు తెలుస్తోంది. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని పంట పొలాల్లోకి తీసుకువెళ్లి అక్కడ గోతిని తీసి మృతదేహాన్ని పెట్రోల్‌తో తగులబెట్టి పూడ్చివేసినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్‌ఐ బాలనాగిరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి శవ పంచనామా నిర్వహించారు.
పోలీసుల అదుపులో నిందితులు..
హత్య అనంతరం నిందితులు రూరల్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. జాన్‌బీతోపాటు మరో నలుగురు హత్యలో పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment