ప్రమాదానికి గురైన బస్సు
కాళ్లు విరిగిన వారు కొందరు.. చేతుల విరిగినోళ్లు మరికొందరు.. పక్కటెముకలు, నుదుటి భాగం, మోకాళ్లు, మోచేతులకు తీవ్రగాయాలైన వారు ఇంకొందరు.. హాహాకారాలతో ఏడుపులు, అరుపులతో ప్రాణాలను అరిచేతబట్టుకొని బతుకుజీవుడా..అంటూ బయటపడ్డారు. గురువారం ఉదయం చీమకుర్తి–సంతనూతలపాడు సరిహద్దులో ఆర్టీసీ బస్సు ఓ చెట్టును ఢీకొంది. ప్రమాదంలో ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
సాక్షి, చీమకుర్తి(ప్రకాశం) : చీమకుర్తి–సంతనూతలపాడు మధ్య కర్నూల్ రోడ్డుపై ఎర్రగుడిపాడు సమీపంలో కనిగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు చీమకుర్తి మీదుగా ఒంగోలు వెళ్తూ రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన 20 మందికి నుదుటిపై, పక్కటెముకలు, మోకాళ్లు, మోచేతులపై గాయాలయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు జీవుడా అంటూ బయటకు పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిలో హనుమంతునిపాడు మండలం పెద్దగొల్లపల్లికి చెందిన వేంపాటి సరసమ్మ ఉంది. ఆమెకు రెండు కాళ్లూ విరిగాయి. వాటితో పాటు రెండు చేతుల మణికట్ల వద్ద విరిగి విలవిల్లాడిపోయింది. మరో వృద్ధురాలు లక్ష్మమ్మకు రెండు కాళ్లూ విరిగాయి. సీహెచ్ సుశీలమ్మ, డి.లక్ష్మమ్మ, ఆర్టీసీ బస్సు డ్రైవర్ శీలం రామారావు కాళ్లు, చేతులకు బలమైన గాయాలై ఒంటి నిండ రక్తస్రావంతో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.
స్వల్ప గాయాలైన వారిలో పి.శివశంకర్, వి.సుబ్బులు, జి.నాగేశ్వరరావు, మహ్మద్ అన్సారీ, సీహెచ్ శ్రీను, నర్సారెడ్డి, సుబ్బమ్మ, టి.శ్రీనివాసరావు, సీహెచ్ వెంకయ్య, బి.తిరుపతమ్మ, ఎన్.వెంకటేశ్వర్లు, వి.సీతమ్మ, ఏ.బ్రహ్మారెడ్డి, వై.సుజాత, ఆశీర్వాదం, లక్ష్మారెడ్డి ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురు హనుమంతునిపాడు మండలానికి చెందిన వారు కాగా మిగిలిన వారిలో కొంతమంది కనిగిరి, చీమకుర్తి, తొర్రగుడిపాడు, ఏలూరివారిపాలెం గ్రామాలకు చెందిన వారు. సంఘటన స్థలాన్ని సీఐ పి.సుబ్బారావు, ఎస్‌ఐ పి.నాగశివారెడ్డి పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదం ఎలా జరిగిందో ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులను చీమకుర్తి ప్రభుత్వాస్పత్రికి కొంతమందిని, మరికొంతమందిని రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఎస్‌ఐ పి.నాగశివారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీల్‌చైర్స్‌లో రిమ్స్‌కు వస్తున్న క్షతగాత్రులు, గాయాలపాలైన డ్రైవర్
ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు
ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. అతివేగం కారణంగానే బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైందని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యక్షంగా చూసిన వారు మాత్రం ప్రమాదం సమయంలో డ్రైవర్‌కు ఆరోగ్యం బాగులేదని, బీపీ డౌన్ కావడంతో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిందని పేర్కొంటున్నారు. చాలాకాలంగా ఆరోగ్యం సరిలేని డ్రైవర్ శీలం రామారావు ఈ నెల 4వ తేదీ వరకు కనిగిరి డిపోలో గ్యారేజీలో పార్కింగ్ డ్యూటీలో ఉన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి డిపో అధికారులు రామారావుకు మళ్లీ లైన్ డ్యూటీ వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన డ్యూటీకి వచ్చాడు. ఆరోగ్యం బాగులేని కారణంగానే ప్రమాదానికి కారణమై ఉంటుందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదంపై కనిగిరి ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ కామేశ్వరిని వివరణ కోరగా 4వ తేదీ వరకు పార్కింగ్ డ్యూటీలో డ్రైవర్ రామారావు ఉన్నాడని, అందరిలాగే ఈ నెల 5 నుంచి లైన్ డ్యూటీ వేసినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment