
సాక్షి, ఒంగోలు: ప్రకాశం జిల్లా దర్శిలో స్కూల్ విద్యార్థులు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్థానిక చింతలపాడు రోడ్డులో ఎస్వీఆర్ పాఠశాల బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి పంట కాలువలోకి దూసుకుపోయింది. బస్సు బోల్తా పడటంతో ఆరుగురు చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. బస్సులో సుమారు 12 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. విద్యార్థులను వెంటనే 108 అంబులెన్స్ ద్వారా దర్శి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చిన్నారులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.