
వంశీధర్‌పండా
రాయగడ : రాయగడకు 26కిలోమీటర్ల దూరంలో గల తేరువలి పంచాయతీలో ఇండియన్ మెటల్స్, ఫెర్రోఎల్లాయీస్ (ఇంఫా), చౌద్వార్‌లో విద్యుత్ పరిశ్రమ వ్యవస్థాపకుడు, భారత సీనియర్ సైంటిస్టు అయిన వంశీధరపండా మంగళవారం మృతి చెందారు. వంశీధర్‌పండా భువనేశ్వర్‌లోని చంద్రశేఖర్ పూర్ ప్రాంతంలో ఉంటున్నారు. 1962లో రాయగడ వంటి ఆదివాసీ జిల్లాలో జిల్లా అభివృద్ధి, దేశ ఆర్థికాభివృద్ధి, వెనుకబడిన ప్రాంతంలో విద్యాభివృద్ధి, రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని తేరువలి ప్రాంతంలో ఇంఫా పరిశ్రమను ఏర్పాటు చేశారు.
తదుపరి చౌద్వార్‌లో విభిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి దేశ ప్రగతికి కృషి చేసిన సైంటిస్టులలో వంశీధర్‌పండా ప్రథమ వ్యక్తి. నేటి బీజేడీ నుంచి బయటకు వచ్చిన ఎంపీ వైజయంతిపండా తండ్రి వంశీధరపండా. 1931లో జన్మించిన వంశీధరపండా చిన్నతనం నుంచి విద్యలో గోల్డ్‌మెడలిస్టు.
విదేశాలలో చదువుకున్న వంశీధరపండా దేశానికి వచ్చి రాయగడ జిల్లాలోని తేరువలి ప్రాంతంలో ఇంఫా పరిశ్రమను ప్రారంభించారు. ఇంఫా పరిశ్రమపై ఆధారపడి 3వేల మంది పైబడి ఉన్నారు. సుమారు 10గ్రామ పంచాయతీలు ఇంఫా పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి. వంశీధర పండా హఠాత్తుగా మృతి చెందడంతో ఇంఫా కుటుంబంతో సహా జిల్లా, రాష్ట్ర ప్రజలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.