పరిగి, వికారాబాద్ : పరిగి ఎస్‌ఐ 2గా విధులు పని చేస్తున్న ఓబుల్‌రెడ్డిపై వేటు పడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఓ కేసు విషయంలో పరిగి ఠాణాకు తీసుకొచ్చి ఓ యువకుడిని చితకబాదిన ఘటన ఇటీవల వివాదస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ విషయంలో స్పందించిన ఆయా దళిత, ప్రజా సంఘాల నాయకులు ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. ఈక్రమంలో ఎస్పీ అన్నపూర్ణను కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై ఆమె ఏఎస్పీ నర్సింలును విచారణాధికారిగా నియమించి జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించారు. ఆయన మూడు రోజుల క్రితం పరిగిని సందర్శించి విచారణ జరిపారు. అనంతరం ఎస్పీకి నివేదిక అందజేశారు. అయితే, ఆయా సంఘాల నాయకులు ఘటనపై ఆందోళన కొనసాగించారు. మంగళవారం టీ మాస్ నాయకులు పరిగిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఎస్‌ఐ ఓబుల్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మంగళవారం ఓబుల్‌రెడ్డిపై బదిలీ వేటు వేసినట్లు తెలిసింది. అయితే, వేరే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ విషయమై ఓ పోలీస్ అధికారిని వివరణ కోరగా బదిలీ చేసింది వాస్తవమే..ఇంకా ఉత్తర్వులు అందాల్సి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment