సిద్ధాంతి భార్య సూర్యకుమారి నుండి వివరాలు సేకరిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ బాలకృష్ణ ప్రక్కి వీరభద్రరావు (సిద్ధాంతి)
నిడదవోలు : నిడదవోలు పట్టణం చిన కాశిరేవు సమీపంలో నివాసముంటున్న ప్రముఖ సిద్ధాంతి ప్రక్కి వీరభద్రరావు శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో కిడ్నాప్‌కు గురయ్యారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న సిద్ధాంతి ఇంటికి టాటా సుమోలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు సివిల్ దుస్తుల్లో వచ్చారు. ఇంటిలో స్నానానికి ఉపక్రమిస్తున్న వీరభద్రరావును అటకాయించారు. ఆయన సెల్‌ఫోన్ తీసుకుని స్విచ్‌ఆఫ్ చేశారు. విజయవాడ ఇంటిలిజెన్స్ పోలీసులమని పరిచయం చేసుకున్నారు. మీతో పనిఉందని, విజయవాడ ఇంటిలిజెన్స్ అధికారి రమ్మంటున్నారని చెప్పారు. ఉదయం పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటకు వెళ్లే అలవాటు ఉన్న ఆయనను తీసుకువెళ్ళడంతో భార్యకు అనుమానం వచ్చింది. స్నానం కూడా చేయనివ్వకుండా ఎందుకు తీసుకువెళుతున్నారని భార్య సూర్యకుమారి వారిని ప్రశ్నించగా సాయంత్రానికి తిరిగి పంపించేస్తామని చెప్పారు. మెయిన్ రోడ్డుకు 100 అడుగుల దూరంలో ఉన్న ఇంటి నుండి వీరభద్రరావును నడిపించుకుంటూ తీసుకెళ్ళారు. రోడ్డుపైకి రాగానే టాటా సుమోలో తీసుకువెళ్ళి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇంటి నుండి సిద్ధాంతి బయటకు వెళ్ళిన పది నిమిషాలకు భార్య ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ చేసి ఉండటంతో ఏం జరిగింది... ఎక్కడకు తీసుకుని వెళ్ళారో తెలియక బంధువులు ఆందోళన చెందుతున్నారు. సిద్ధాంతికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు బెంగళూరు, హైద్రాబాద్‌లో ఉంటున్నారు. కిడ్నాప్ సమయంలో ఇంటిలో వీరభద్రరావుతో పాటు భార్య ఒక్కరే ఉన్నారు. నిడదవోలు రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్‌గా ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేసిన వీరభద్రరావు జ్యోతిష్యం, జాతకాలు చెప్పడంలో మంచి పేరు సంపాదించారు. ఆయన చెప్పింది చాలా వరకు జరుగుతుందని కొందరి నమ్మకం. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉన్నత స్థాయి అధికారులు, న్యాయమూర్తులు ప్రతీ ఏటా ఆయన ఇంటికి వచ్చి జాతకాలు, జ్యోతిష్యం చెప్పించుకుంటారు. అసలు ఏం జరిగింది. ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు. కొవ్వూరు డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణలు తమ సిబ్బందితో వీరభద్రరావు ఇంటికి చేరుకున్నారు. ఆయన భార్య సూర్యకుమారి నుంచి వివరాలు సేకరించారు. పట్టణంలో వివిధ సెంటర్ల ద్వారా తెల్లవారు జాము నుండి వాహనాల రాకపోకలను సీసీ పుటేజీల ద్వారా పరిశీలిస్తున్నారు. రెండు టాటా సుమో వాహనాలు తిరిగినట్లు పోలీసులు గుర్తించారు. సిద్ధాంతి ఇంటి చుట్టు పక్కల ఉన్న షాపుల యజమానులను ఆరా తీస్తున్నారు. పట్టణంలో ఉన్న లాడ్జీలలో ఉన్న రికార్డులను పరిశీలిస్తున్నారు. భార్య సూర్యకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిడదవోలు పట్టణ పోలీసులు కిడ్నాప్ కేసుగా నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
కిడ్నాప్‌పై భిన్న కథనాలు : నిడదవోలుకు చెందిన ప్రముఖ సిద్థాంతి వీరభద్రరావు కిడ్నాప్‌పై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. కిడ్నాప్ సమాచారంతో పట్టణంలో కలకలం రేగింది. అసలు సిద్ధాంతిని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు, అసలు అంత అవసరం ఎవరికి ఉందనేది చర్చించుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం విజయవాడ టాస్క్‌ఫోర్సు పోలీసులు తీసుకువెళ్ళి ఉంటారని భావిస్తున్నారు. సిద్ధాంతి వీరభద్రరావు నిడదవోలు రైల్వే చీఫ్ బుకింగ్ సూపర్‌వైజర్‌గా ఆరు నెలల క్రితం పదవీ విరమణ చేశారు. పట్టణంలో పదవీ విరమణ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించారు. సిద్ధాంతిగా రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వీరభద్రరావు పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి ఎంపీలు, న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. గతంలో డీజీపీ స్థాయి అధికారి కూడా యాగం చేయించుకున్నారు. ఎవరితో విరోధాలు కూడా లేని వీరభద్రరావును కీలకమైన అంశంలో టాస్క్‌ఫోర్సు పోలీసులు తీసుకువెళ్ళారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయనను హైదరాబాద్ పోలీసులు తీసుకెళ్లి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment