
సాక్షి, హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన సంఘటన రాచకొండ నేరేడ్‌మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విడాకుల కేసు విచారణ నిమిత్తం మల్కాజ్‌గిరి కోర్టుకు హాజరైన శ్రీధర్ అనే వ్యక్తిని అతని బావమరుదులు నడిరోడ్డుపైనే కత్తితో పొడిచి చంపారు. మూడేళ్ల క్రితం శ్రీధర్ కు మల్కాజ్‌గిరికి చెందిన సుహాసినితో వివాహం జరిగింది. అయితే రెండేళ్లుగా వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.
దీంతో సుహాసిని తన భర్త శ్రీధర్‌పై కేసు పెట్టడంతో విడాకుల వివాదం కోర్టులో నడుస్తోంది. ఇవాళ ఉదయం కోర్టుకు హాజరై కారులో వెళ్తుండగా శ్రీధర్‌పై నలుగురు వ్యక్తులు దాడి చేసి, కత్తితో నరికి చంపారు. కాగా తన కుమారుడి బావమరుదులైన వినయ్, విగ్నేష్ లే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లుగా తన కొడుకును చంపేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీధర్ తండ్రి అన్నారు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment