పోలీసుల కాల్పుల్లో మరణించిన కలియప్పన్
తూత్తుకూడి : దక్షిణ తమిళనాడులోని తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్(రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా బుధవారం అన్నానగర్ ప్రాంతంలో బంద్ నిర్వహిస్తున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి మరణించాడు. అయితే అతని మరణానికి ప్రధాన కారణం పోలీసుల నిర్లక్ష్య వైఖరే. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని చూట్టూ పోలీసులు మూగారు. అతని పరిస్థితేంటో కూడా తెలుసుకోకుండా ఓ పోలీసు లాఠీతో బెదిరిస్తూ...‘నటించింది చాలు ఇక వెళ్లు’ అని కసురుకున్నాడు .
బుల్లెట్ తగిలి తీవ్ర రక్తస్రావమైన అతడిని సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. గాయాలతో రక్తమోడుతున్న వ్యక్తి పట్ల కనీసం కనికరం కూడా చూపకుండా కర్కశంగా ప్రవర్తించిన పోలీసుల వైఖరిని అందరూ తప్పుపడుతున్నారు. తూత్తుకుడిలోని స్టెరిలైట్ రాగి కర్మాగారాన్ని మూసివేయాలని ఆందోళన చేస్తున్న ప్రజలపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 22 ఏళ్ల కలియప్పన్ అనే వ్యక్తికి బుల్లెట్ తగిలింది. దాంతో బాధ భరించలేక అతను అక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసిన ఓ పోలీసు అధికారి కనీసం ఆస్పత్రికి కూడా తరలించకుండా ‘నటించింది చాలు ఇక వెళ్లు’ అని అనడం అక్కడే ఉన్న ఓ రిపోర్టర్ వీడియో తీశాడు. దాంతో ఈ వీడియో కాస్తా సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ దారుణ ఘటనలో ఇప్పటివరకు కలియప్పన్‌తో కలిపి 13 మంది మరణించారు. ముందస్తు హెచ్చరికలు లేకుండా ప్రజలపై కాల్పులు జరిపినందుకు గానూ తూత్తుకుడి జిల్లా కలెక్టర్, పోలీసు అధికారిని బుధవారం బదిలీ చేశారు. కానీ పోలీసులు మాత్రం ఆందోళనకారులు తమపై రాళ్లు రువ్వడం వల్లే తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపారు. ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కాల్పులు జరుపుతున్న సమయంలో ఓ పోలీసు అధికారి బస్సు పైకి ఎక్కి ‘కనీసం ఒక్కరైనా చావాలి’ అని అంటున్న వీడియో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment