
సాక్షి, పుణే : మానవత్వం మరిచి అతిదారుణంగా వ్యవహరించారు. ఉన్మాద చర్యలతో మూగజీవాలను కిరాతకంగా చంపుతున్న వరుస ఘటనలు మహారాష్ట్రలో కలకలం రేపుతున్నాయి.
వివరాల్లోకి వెళ్లితే.. పశ్చిమ పుణేలోని బేనర్ ప్రాంతంలోని పొదల్లో వాటి కళేబరాలను స్థానికులు గుర్తించారు. వెంటనే ఓ జంతు రక్షణ సంస్థ వారికి సమాచారం అందించగా, వారు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ భయానక దృశ్యాన్ని చూసిన వాళ్లంతా షాక్‌కి గురవుతున్నారు. ఓ కుక్క పిల్లతోసహా నాలిగింటిని సుమారు 50 మీటర్లపాటు ఈడ్చుకెళ్లి మరీ డీజిల్ పోసి వాటిని కాల్చి చంపారు. కేవలం వాటి అస్థికలు మాత్రమే అక్కడ మిగిలాయి. వాటిని పరీక్ష నిమిత్తం కెమికల్ లాబోరేటరీకి పంపినట్లు పోలీసులు వెల్లడించారు. నివేదిక వచ్చాక క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వారు చెబుతున్నారు.
కాగా, వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో 16 కుక్కలకు గుర్తుతెలియని దుండగులు విషం పెట్టి చంపారు. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి కుక్కలకు చపాతీ పెడుతూ కనిపించాడని, బహుశా అతగాడే ఈ పని చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. వరుసగా జంతువులను ఇలా చంపుతుండటంపై ఎనిమల్ వెల్ఫేర్ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment