బాలుని మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు వరుణ్(ఫైల్)
మొయినాబాద్ (చేవెళ్ల): ఉదయం ఇంట్లోంచి పాఠశాలకు వెళ్లేటప్పుడు అమ్మా టాటా అంటూ నవ్వుతూ చెప్పి వెళ్లిన బాలుడు మధ్యాహ్నానికి ఇంటి ముందే విగతజీవిగా మారాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి బలయ్యాడు. బస్సు కింద పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే గారాబంగా గోరుముద్దలు తినిపించాలనుకున్న ఆ తల్లికి తీరని శోకం మిగిల్చాడు. ఈ హృదయవిదారకమైన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన బసవాని సునీల్, భాగ్యలక్ష్మి దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువుకోసం మొయినాబాద్ మండలం ఎనికేపల్లి గ్రామానికి వలస వచ్చారు. తమ ముగ్గురు కొడుకులతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. సునీల్ గ్రామ సమీపంలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. సునీల్ పెద్ద కుమారుడు వరుణ్ (9) చిలుకూరులోని ఓ పాఠశాలలో స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నాడు.
రోజూలాగానే శనివారం ఉదయం స్కూల్ బస్సులో వెళ్లాడు. శనివారం హాఫ్‌డే కావడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్కూల్ బస్సులో ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు బస్సు ఆగడంతో బస్సులోంచి దిగి రోడ్డు దాటేందుకు బస్సు ముందుకు వెళ్లాడు. బాలుడిని గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో బాలుడు సిమెంటు రోడ్డుపై పడిపోయాడు. బస్సు ముందు చక్రం అతని తలపై నుంచి పోవడంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పెద్దగా అరవడంతో బస్సును అక్కడే నిలిపేశాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. ఉదయం కొడుకు చెప్పిన మాటలను తలుచుకుంటూ తల్లి రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
పాఠశాల యాజమాన్యం బాలుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు బాలుడి మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సును మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment