సురేష్‌ ఆచూకీ లభ్యం | Suresh Found In AP Visakhapatnam | Sakshi
Sakshi News home page

సురేష్‌ ఆచూకీ లభ్యం

Published Fri, Apr 20 2018 12:31 PM | Last Updated on Fri, Apr 20 2018 12:31 PM

Suresh Found In AP Visakhapatnam - Sakshi

తల్లిదండ్రులు, తమ్ముడు అశోక్, భార్య ప్రభాతతో సురేష్‌(ఫైల్‌)

సూర్యాపేట క్రైం : రూ.కోట్లల్లో అప్పులు చేసి ఉడాయించిన సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కస్తూరి సురేష్‌ ఆచూకీని ఎట్టకేలకు పోలీసులు కనిపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ప్రకాశ్‌జాదవ్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సురేష్‌ను మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు.

పదేళ్లుగా ‘ఆన్‌లైన్‌’ వ్యాపారం
బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగి కస్తూరి జనార్దన్‌ కుమారుడు సురేష్‌ పదేళ్ల నుంచి ఆన్‌లైన్‌ (ఫారెక్స్‌) వ్యాపారం చేస్తున్నాడని ఎస్పీ తెలిపారు. 2009 నుంచి ఆన్‌లైన్‌ వ్యాపారం చేస్తున్న సురేష్‌ రూ.10 వేల నుంచి రూ.లక్షలు అప్పులు చేసి రూ.5 నుంచి రూ.7ల వరకు వడ్డీలు చెల్లిస్తూ వస్తున్నాడు. ఆన్‌లైన్‌ వ్యాపారంలో పెద్ద ఎత్తున నగదు పెట్టేందుకు సూర్యాపేటకు చెందిన 47 మంది నుంచి రూ.6 కోట్ల వరకు అప్పులు చేశాడు.  ప్రతి నెలా అసలు ఉంచి.. వడ్డీ ఇస్తూ సురేష్‌ వ్యాపారం సాగిస్తు వస్తున్నాడన్నారు. ఎవరి దగ్గరైనా వడ్డీకి తీసుకున్న డబ్బులకు ప్రతినెలా 10వ తేదీన వడ్డీ చెల్లించేవాడన్నారు. అదే మాదిరిగా గత ఏడాది.. ఆగస్టు, సెప్టెంబర్‌ నెల 10వ తేదీన తీసుకున్న నగదుకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో..
డబ్బులు ఇచ్చిన వారు వడ్డీ .. లేదా అసలైనా ఇవ్వాలని ఒత్తిడి పెంచడంతో చేసేదేమి లేక.. సెప్టెంబర్‌ 10వ తేదీ సాయంత్రం సురేష్‌ తన భార్య ప్రభాతకు పూణె వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. పదో తేదీ రాత్రి ఇంటికి రాకుండా తిరిగి 11వ తేదీన   పూణెలో డబ్బుల కోసం వెళ్తున్నానని మరోమారు భార్యకు ఫోన్‌ చేసి చెప్పాడు. డబ్బుల కోసం ఎంత  ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో  తిరిగి భార్యకు 12వ తేదీన సాయంత్రం ఫోన్‌ చేసి చెప్పి డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నానని.. నా కోసం.. ఇంటి వద్దకు అప్పులవారు వస్తారు.. అమ్మనాన్న దగ్గరి నుంచి వెళ్లిపోండని చెప్పాడు. దీంతో చేసేదేమి లేక భార్య ప్రభాత అత్తమామలకు చెప్పి 13వ తేదీన వారి ఇంటికి వెళ్లిపోయింది. తిరిగి అత్తమాతలు జనార్దన్, చంద్రకళలు ఫోన్‌ చేయడంతో ప్రభాత 16వ తేదీన సాయంత్రం సూర్యాపేటలోని వారి నివాసానికి చేరుకుంది. 16వ తేదీన సురేష్‌ కన్పించకుండా పోయారంటూ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో భార్య ప్రభాత ఫిర్యాదు కూడా చేసింది.  11 వ తేదీ రాత్రి నుంచి సురేష్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌లో ఉండడంతో చేసేదేమి లేక.. 17వ తేదీన అర్ధరాత్రి కూడా సురేష్‌కు పదే పదే ఫోన్‌ చేసినప్పటికీ స్విచ్‌ ఆఫ్‌ లో ఉండడంతో కుటుంబ యజమాని అయిన జనార్దన్‌తో పాటు భార్య చంద్రకళ, చిన్న కుమారుడు అశోక్, సురేష్‌ భార్య ప్రభాత, కుమార్తెలు సాన్విక, రుత్వికలు సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సెప్టెంబర్‌ 25న యూట్యూబ్‌లో చూసి..
అరువు ఇచ్చిన వారి నుంచి వేధింపులు తాళలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయిన సురేష్‌కు తన తల్లిదండ్రులు, తమ్ముడు, భార్య, కుమార్తెలు మృతిచెందిన విషయం సెప్టెంబర్‌ 25వ తేదీన యూట్యూబ్‌లో చూసి తెలుసుకున్నాడు. అప్పుడు సురేష్‌ వారణాసిలో ఉన్న సురేష్‌ భయంతో ఇక్కడికి రాలేకపోయాడు. వారణాసి నుంచి వయా, కోల్‌కత్తా, వరంగల్, వైజాగ్, విజయవాడలో తిరిగాడు.

అందరి అప్పులు తీర్చేస్తా..
ఎవరి వద్ద నుంచి అప్పు తీసుకున్నానో.. వారందరికీ చెల్లించేందుకు గాను తనకు రెండుమూడేళ్ల సమయం ఇస్తే తీరుస్తానని సురేష్‌ మీడియా ఎదుట చెప్పాడు. ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో షేర్లు పెట్టేందుకే రూ.6 కోట్లు తీసుకున్నట్లు తెలిపాడు. వ్యాపారంలో నష్టం రావడంతోనే  ఎవరికి చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయనన్నారు.  ఈలోపు మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్లు వారం రోజులకే తెలిసిందన్నారు.  భయంతోనే ఇక్కడికి రాలేకపోయనని తెలిపాడు.– కస్తూరి సురేష్‌

బ్యాంకు ఖాతాపై నిఘాపెట్టి..
అయితే సురేష్‌ మిస్సింగ్‌ కేసు నమోదునైప్పటి నుంచి సూర్యాపేట డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టింది. అప్పటి నుంచి సురేష్‌ బ్యాంకు ఖాతాలపై నిఘాపెట్టి నగదు లావాదేవీలపై దృష్టి సారించారు. ఇటీవల విశాఖపట్నంలో అతడి ఖాతానుంచి లావాదేవీలు జరగడంతో  ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గొర్ల కృష్ణ, గోదేషి కరుణాకర్‌లు   వైజాగ్‌ వెళ్లి సురేష్‌ను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ వివరించారు.  అయితే ఇప్పటి వరకు సురేష్‌పై అప్పులిచ్చిన వారు ఎవరూ కూడా ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. సురేష్‌పై మిస్సింగ్‌ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కేసును చాకచక్యంగా ఛేదించిన  ఎస్‌ఐ శ్రీనివాస్, ఐడీపార్టీ బృందాన్ని ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు ఉన్నారు.

అరువే..అంతం చేసింది..
సురేష్‌ జల్సాలకు అలవాటు పడి అనతికాలంలో కోట్లల్లోకి ఎదగాలన్న ఆశ కుటుంబాన్ని అంతం చేసేలా చేసింది. అయిన వాళ్ల నుంచే కాకుండా.. స్నేహితులు, సమీప బంధువుల నుంచి రూ. కోట్లల్లో అరువు తీసుకున్నాడు. ఆన్‌లైన్‌ వ్యాపారంలో బాగా కలిసివస్తుందని ఆశపడ్డాడు. బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కత్తాలతో పాటు గోవా లాంటి ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ వ్యాపారంలో జోరుగా పాలుపంచుకున్నట్లు తెలిసింది. ఈ వ్యాపారం కొన్ని రోజుల పాటు బాగానే సాగినప్పటికీ అరువు తెచ్చిన వాళ్లకు లక్ష రూపాయలకు నెలకు రూ.10 వేల వడ్డీ కూడా ఇచ్చి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా ఆశపడ్డ వారు పెద్ద మొత్తంలో సురేష్‌కు ఎక్కువ నగదును ముట్టజెప్పారు. తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఉడాయించాడు. తీరా అప్పులిచ్చిన వారు ఇంటిమీద పడడంతో కుటుంబ పెద్దతో సహా మరో ఐదుగురు సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement