![Three get death sentence for Kopardi rape and murder - Sakshi](/styles/webp/s3/article_images/2017/11/30/repa.jpg.webp?itok=tFsYi6Ip)
సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా కోపర్డీ గ్రామానికి చెందిన పదిహేనేళ్ల బాలికనురేప్ చేసి చంపేసిన కేసులో ముగ్గురు దోషులకు అహ్మద్‌నగర్ సెషన్స్ కోర్టు బుధవారం మరణశిక్ష విధించింది. ఈ దారుణానికి పాల్పడ్డ దోషులు జితేంద్ర బాబూలాల్ షిండే(25), సంతోష్ గోరఖ్ భావల్(30), నితిన్ గోపీనాథ్ భైలూమే(23)లకు మరణశిక్ష విధిస్తూ అదనపు ప్రత్యేక జడ్జి సువర్ణ కేవలే తీర్పునిచ్చారు. అత్యాచారం, హత్య, నేరపూరిత కుట్ర తదితర అభియోగాల కింద న్యాయమూర్తి వీరిని నవంబర్ 18న దోషులుగా నిర్ధారించారు.
కోర్టు తీర్పుతో తన కుమార్తెకు నిజమైన న్యాయం జరిగిందని మృతురాలి తల్లి వ్యాఖ్యానించారు. మరోవైపు ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి కోర్టు తాజా తీర్పు ఓ హెచ్చరిక అని ప్రభుత్వ న్యాయవాది ఉజ్వల్ నికమ్ తెలిపారు. మరణశిక్షతో పాటు దోషులకు కోర్టు యావజ్జీవ శిక్షను, మూడేళ్ల కఠిన కారాగార శిక్షను విధించిందన్నారు. ఈ శిక్షలన్నీ ఒకేసారి అమలవుతాయన్నారు. అంతేకాకుండా దోషులకు ఒక్కొక్కరికి కోర్టు రూ.20 వేల జరిమానా విధించిందని వెల్లడించారు.
మహారాష్ట్రలోని కోపర్డీ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక(15)ను 2016, జూలై 13న ఈ ముగ్గురు దుండగులు రేప్‌చేసి చంపేశారు. ఆమెను తీవ్రంగా గాయపర్చిన అనంతరం కాళ్లు, చేతులు విరగ్గొట్టి కిరాతకంగా హత్యచేశారు. ఈ ఘటనతో మహారాష్ట్రలో తీవ్ర ప్రజాగ్రహం వెలువెత్తింది. తమ వర్గానికి చెందిన అమ్మాయి చనిపోవడంతో వేలాది మంది మరాఠాలు రాష్ట్రవ్యాప్తంగా మౌన ప్రదర్శన నిర్వహించారు.
మరో నిర్భయ..!
2016 జూలై 13న మహారాష్ట్రలో జరిగిన ‘కోపర్డీ’ హత్యాచారం కేసు తీవ్రమైన రాజకీయ, కులపరమైన వివాదాన్ని పురిగొల్పి, దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. అహ్మద్‌నగర్ జిల్లా కర్జాట్ తాలుకా కోపర్డీ గ్రామానికి చెందిన ఈ బాలిక(15) అదే ఊరిలోని తాత ఇంటి నుంచి సైకిల్‌పై తిరిగి వస్తుండగా ప్రధాన నిందితుడు జితేంద్ర షిండే అటకాయించాడు. అంతకు ముందు నుంచే ఆ అమ్మాయిని వేధిస్తున్న షిండే.. ఆమెను బలాత్కరించబోయాడు.
స్వతహాగా కబడ్డీ క్రీడాకారిణి అయిన బాలిక అతని చర్యను తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ పరిణామంతో మరింతగా రెచ్చిపోయిన షిండే బాలికను తీవ్రంగా హింసించి మానభంగానికి పాల్పడ్డాడు. అనంతరం తన మిత్రులు నితిన్ భైలూమే, సంతోష్ భావల్‌లను అక్కడకు పిలిపించి వారితో కలిసి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత దుండగులు బాలికను తీవ్రంగా గాయపర్చడంతో పాటు ఆమె కాళ్లు, చేతులు విరిచేశారు. అనంతరం సదరు బాలికను గొంతునులిమి కిరాతకంగా హత్యచేశారు.
♦ 2016 జూలై 15న ప్రధాన నిందితుడు జితేంద్ర షిండే, 16న సంతోష్ భావల్, 17న నితిన్ భైలూమేల అరెస్ట్
♦అక్టోబర్ 7న 350 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు
♦2017 మే 24న 31 మంది సాక్ష్యాల పరిశీలన అనంతరం విచారణ ముగింపు
♦నవంబర్ 18న మైనర్ బాలికపై అత్యాచారం, హత్య ఆరోపణలపై ముగ్గురిని దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు
♦నవంబర్ 29న ముగ్గురికి మరణశిక్ష విధిస్తూ అహ్మద్‌నగర్ సెషన్స్ కోర్టు తీర్పు
–సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment