రవిప్రకాశ్‌ కోసం మూడు బృందాలు  | Three groups are searching for Ravi Prakash | Sakshi
Sakshi News home page

రవిప్రకాశ్‌ కోసం మూడు బృందాలు 

Published Wed, May 22 2019 1:36 AM | Last Updated on Wed, May 22 2019 8:42 AM

Three groups are searching for Ravi Prakash - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. అతని ఆచూకీ కోసం ఇప్పటికే మూడు బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్‌ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బృందం రవిప్రకాశ్‌ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రవిప్రకాశ్‌కు ఏపీలోని కొందరు రాజకీయ నాయకులు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం. వారి వద్దే సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రముఖుల అండతోనే శివాజీ తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. ఇందుకోసం లాయర్లు, అనుచరులతో మాట్లాడేందుకు పదేపదే సిమ్‌కార్డులు మారుస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాట్సాప్‌ కాల్స్‌ను కూడా వాడుతున్నారని సమాచారం. పోలీసులు అతని కాల్స్‌పై నిఘా పెట్టారు. అయితే, ఆయన నిత్యం ఫోన్లు మారుస్తున్నట్లు గుర్తించారు. 

ఎవరి కేసు వారిదే..! 
రవిప్రకాశ్‌ కేసుల విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రెండు కేసుల్లో ఒకటి హైదరాబాద్, మరొకటి సైబరాబాద్‌లో నమోదయ్యాయి. శివాజీతో కలసి నకిలీ కొనుగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, నకిలీపత్రాల సృష్టి, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్, 66, 72, ఐపీసీ 406, 420, 467, 469, 471 సెక్షన్ల కింద కేసులు సైబరాబాద్‌ పోలీసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌మార్కులు 2018 మే నెలలో మీడియా నెక్స్‌ట్‌ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్‌ పోలీస్‌ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఐపీసీ 467, 420, 409, 406, 120 (బీ) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండింటిలో నిందితుడు ఒకరే అయినా కేసుల నేపథ్యం వేర్వేరు కావడంతో ఎవరి దర్యాప్తును వారే కొనసాగించాల్సి వస్తోంది.

గతంలో ఐటీ గ్రిడ్‌ వ్యవహారంలో మాదాపూర్, ఎస్సార్‌నగర్‌ ఠాణాలలో ఫిర్యాదులు అందాయి. నేరస్వభావం ఒకటే కావడంతో ఈ రెండు కేసులను కలిపి విచారించేందుకు పోలీసు విభాగం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది. రవిప్రకాశ్‌ కోసం పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉద్యోగి ఎంకేవీఎన్‌ మూర్తి, మోజో టీవీ చైర్మన్‌ హరికిరణ్‌లు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారు. రవిప్రకాశ్‌ విషయంలో పాత ఉద్యోగులను కూడా పోలీసులు పిలిపించి కూపీలాగుతున్నారు. అవకతవకల విషయంలో పలు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement