
రాంచీ(జార్ఖండ్): విష వాయువు పీల్చి ముగ్గురు కూలీలు మంగళవారం మృతిచెందారు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని జంతారా జిల్లాలో జరిగింది. స్థానికంగా ఉన్న ఓ బావిలో క్లీన్ చేయడానికి ఒకరి తర్వాత ఒకరు దిగి విషవాయువు పీల్చి చనిపోయినట్లు తెలిసింది. మృతులు నౌషద్ అన్సారీ, అబ్దుల్ రజాక్, షరీఫ్ అన్సారీగా గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం..బావిలో క్లీన్ చేయడానికి నౌషద్ మొదట వెళ్లాడు. ఇతర కూలీలు అరిచినా స్పందించకపోవడంతో ఆ తర్వాత రజాక్ అతని కోసం వెళ్లాడు. అతన కూడా స్పందించకపోవడంతో చివరికి షరీఫ్ వెళ్లాడు. అక్కడ విషవాయువు విడుదల అవుతోందని తెలియక ముగ్గురూ కూడా పీల్చి మృత్యువాత పడ్డారు. చివరికి ముగ్గురినీ నాలుగు గంటల అనంతరం బయటికి తీసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ముగ్గురూ మృతిచెందినట్లు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.