
కాల్పుల్లో మృతిచెందిన మోహన్‌రాజ్, ఉరిశిక్ష పడిన మనోహరన్ (ఫైల్)
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడును కుదిపేసిన చిన్నారిపై హత్యాచారం, చిన్నారి తమ్ముడి దారుణ హత్య కేసులో సుప్రీంకోర్టు గురువారం సంచలనాత్మకమైన తీర్పు చెప్పింది. నిందితుడు మనోహరన్‌కు మద్రాసు హైకోర్టు విధించిన రెండు ఉరిశిక్షలు, రెండు యావజ్జీవశిక్షలను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. వివరాలు.కోయంబత్తూరు రంగేగౌడర్‌వీధికి చెందిన రంజిత్ వస్త్రవ్యాపారి. ఇతని ముస్కరన్ (10) అనే కుమార్తె, రితిక్ (7) అనే కుమారుడు ఉన్నారు. వీరిద్దరూ ఐదు, మూడవ తరగతి చదువుతున్నారు. 2010 అక్టోబర్ 29న అద్దెవ్యానులో వ్యాన్‌డ్రైవర్ మోహన్‌రాజ్ అలియాస్ మోహనకృష్ణన్ తన స్నేహితులైన మనోహరన్ సహకారంతో కిడ్నాప్‌చేసి పొల్లాచ్చి కొండప్రాంతానికి తీసుకెళ్లారు. చిన్నారి ముస్కరన్‌పై మోహన్‌రాజ్ అత్యాచారం చేశాడు. ఆ తరువాత స్నేహితులిద్దరూ కలిసి ఆ ఇద్దరు చిన్నారులను అక్కడి బీఏబీ వాగులోకి తోసివేసి హత్యచేశారు. ఈ జంట హత్యకేసులపై కోవై పోలీసులు కేసు నమోదు చేసి మోహన్‌రాజ్, మనోహరన్‌లను అరెస్ట్ చేశారు.
కేసు విచారణలో భాగంగా నిందితులిద్దరినీ అదే ఏడాది నవంబర్ 9న వ్యాన్‌లో తీసుకెళుతుండగా పెత్తనూరు సమీపంలో ఒక పోలీసుల చేతుల్లోని తుపాకీలను లాక్కుని పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు జరపగా మోహన్‌రాజ్ హతమయ్యాడు. మనోహరన్ జరిపిన తుపాకీ కాల్పుల్లో ఎస్‌ఐలు ముత్తుమాలై, జ్యోతి తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో మనోహరన్‌కు రెండు ఉరిశిక్షలు విధిస్తూ కోవై మహిళాకోర్టు 2012 అక్టోబరు 28న తీర్పు చెప్పింది. ఈ తీర్పును మద్రాసు హైకోర్టు 2014 మార్చి 24న నిర్ధారించింది. ఈ తీర్పుపై మనోహరన్ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా ఉరిశిక్షపై అదే ఏడాది స్టే ఇచ్చింది. ఈ స్టేపై తమిళనాడు పోలీసులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. ఈ అప్పీలు పిటిషన్‌పై విచారణలు పూర్తిచేసిన సుప్రీంకోర్టు తీర్పు చెప్పకుండా గత నెల 11న వాయిదావేసింది. ఇదిలా ఉండగా, ఈ కేసు గురువారం మరలా విచారణకు రాగా నిందితుడు మనోహరన్‌కు మద్రాసు హైకోర్టు విధించిన రెండు ఉరిశిక్షలు, మూడు యావజ్జీవ శిక్షలను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు తనకు పడిన ఉరిశిక్షపై రాష్ట్రపతికి కారుణ్య విజ్ఞప్తి లేఖను సమర్పించుకోవచ్చు. ఆ వినతిని రాష్ట్రపతి నిరాకరించిన పక్షంలో ఉరిశిక్ష అమల్లోకి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment