
రాళ్లకుంటలో ఘటనా స్థలాన్ని, మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై, సిబ్బంది
ద్వారకాతిరుమల: జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. అయితే వీరిద్దరి పేర్లు రామకృష్ణ కావడం యాదృచ్ఛికం. పొట్టకూటి కోసం వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఒక గురువారం ద్వారకా తిరుమల మండలం రాళ్లకుంటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బైక్‌పై వెళుతున్న అతడు పెళ్లిజనాలతో వస్తున్న లారీని మలుపులో తప్పించే క్రమంలో వెనుక చక్రాల కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట పంచాయతీ ఆరుపాటి దిబ్బలు గ్రామానికి చెందిన వల్లూరి రామకృష్ణ(45) నల్లజర్ల మండలం అయ్యవరంలో తాపీపని చేస్తున్నాడు.
ఈ క్రమంలో గురువారం ఉదయం పోతవరానికి చెందిన మరో మేస్త్రి కత్తుల సోమరాజుతో కలసి రామకృష్ణ రాళ్లకుంటలోని ఒక స్థలాన్ని పరిశీలించి, తిరిగి అయ్యవరం వెళ్లారు. ఆ తరువాత మళ్లీ ఒక్కడే తన బైక్‌పై ద్వారకా తిరుమలకు వచ్చి పనులు ముగించుకుని, అయ్యవరానికి తిరుగు ప్రయాణమయ్యాడు. సంఘటనా స్థలమైన రాళ్లకుంట మలుపులోకి వచ్చేసరికి నిడదవోలు నుంచి ద్వారకాతిరుమలకు పెళ్లి జనాలతో ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో బైక్ స్కిడ్ అయ్యింది. దీంతో బైక్ ఎడమ వైపునకు పడగా, రామకృష్ణ కుడివైపు లారీ వెనుక చక్రాల కింద పడి నుజ్జునుజ్జయ్యాడు. సంఘటనా స్థలాన్ని ద్వారకాతిరుమల ఎస్సై ఐ.వీర్రాజు, సిబ్బంది పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఇదిలా ఉంటే మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది.
రోడ్డు ప్రమాదంలో మిల్లు కార్మికుడు మృతి
ఆకివీడు: ట్రాక్టర్ స్కూటర్‌ను ఢీ కొన్న ప్రమాదంలో ఓ మిల్లు కార్మికుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన స్థానిక అయి భీమవరం రోడ్డులో గురువారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన మిల్లు కార్మికుడు ఎన్ని రామకృష్ణ(46)స్కూటర్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఇటుక లోడు ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కె.సుధాకరరెడ్డి
తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment