
ఉల్లాల్: మంగళూరులో మంగళవారం దారుణం జరిగింది. అర్ధరాత్రి నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు భారతీయ జనతాపార్టీకి చెందిన మైనారిటీ కార్యకర్తలపై దుండుగులు కత్తులతో హత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో జుబిర్ అనే కార్యకర్త తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఈ ఘటనలోనే తీవ్రంగా గాయపడ్డ మరో కార్యకర్త ఇలియాజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. తమ పార్టీకి చెందిన మైనారిటీ కార్యకర్తలపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది.
స్థానిక ఎమ్మెల్యే ప్రొద్బలంతోనే దుండగులు ఇటువంటి దారుణానికి ఒడిగట్టారని బీజేపీ మైనారిటీ నేత రహీం ఊచిల్ అన్నారు. జుబిర్, ఇలియాజ్‌లు ఇద్దరూ.. బీజేపీ మైనారిటీ విభాగంలో పదేళ్లుగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఈ హత్య, దాడిని మేం రాజకీయం చేయదల్చుకోలేదు.. అయితే బాధితులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఈ దాడి పూర్తిగా వ్యక్తిగత కక్ష్యలతోనే జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.