
ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్‌ను కలిసి తమ గోడు చెప్పుకుంటున్న చింతమనేని బాధితులు
సాక్షి, ఏలూరు (టూటౌన్): దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై శనివారం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాధితులు ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్‌ను కలిసి నేరుగా ఫిర్యాదులు చేశారు. జగన్నాథపురం, సోమవరప్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామాల్లో ఫిర్యాదుదారుల పొలాలను ఆక్రమించి వారిపై చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దళితుల భూములను ఆక్రమణలు చేసి చంపుతామని బెదిరించినట్లు పలువురు బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. చింతమనేనిపై కేసులు పెట్టినా రాజకీయ పలుకుబడి ఉపయోగించి సదరు కేసుల్లో ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అడ్డుపడినట్లు బాధితులు తెలిపారు. దెందులూరు మండలం శ్రీరామవరంలో గతేడాది నవంబరు 15 రాత్రి బహిరంగ ప్రదేశంలో దళితులను ఉద్దేశించి అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడిన విషయం గురించి శనివారం కొత్తపల్లి సురేష్, కొంతమంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ ఇచ్చిన ఫిర్యాదులను పూర్వాపరాలు విచారించిన అనంతరం కేసుల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు.