సాక్షి, హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి 10గంటల సమయంలో ఒక చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి రెండు చిన్న గ్యాంగ్‌ల మధ్య వాగ్వాదం మొదలై గొడవగా మారింది. దీంతో రెండు గ్యాంగ్‌లు రోడ్డుపైనే విచ్చలవిడిగా కొట్టుకున్నాయి. స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దాడి దృశ్యాలు నమోదు కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాబ్‌సాబ్ కుంట వద్ద ఈ ఘటన జరిగింది. చిన్నరోడ్ ప్రమాదం జరగడంతో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు దూషించుకున్నారు. దీంతో ప్రారంభమైన చిన్న గొడవ పెద్దదై.. రెండుగ్రూపులుగా మారి యువకులు కొట్టుకున్నారు. ఈ ఘటనపై స్థానికులు 100కు డయల్ చేయడంతో ఫలక్ నుమా పోలీసులు రంగంలోకి దిగారు. గొడవలో గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. గొడవకు కారణమైన రెండు గ్యాంగ్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు