
ఫైల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలను ఎగవేసి విదేశాల్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. శిక్షనుంచి తప్పించుకునే మార్గాలన్నీ మూసుకు పోవడంతో బ్యాంకుల కన్సార్షియంతో సెటిల్‌మెంట్ ప్యాకేజీని అంగీకరించాలంటూ కోరినట్టు తెలుస్తోంది. త్వరలోనే బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను భారత్‌కు అప్పగించడం ఖాయం అనుకుంటున్న తరుణంలో ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మాల్యా సిద్ధం కావడం గమనార్హం. అయితే మాల్యా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. బ్యాంకుల కన్సార్షియం మునుపటి ఆఫర్లను ఇప్పటికే తిరస్కరించింది. మరి తాజా ప్రతిపాదనపై ఎలా స్పందిస్తుందో చూడాలి. (మాల్యా ‘శరణార్థి’ అభ్యర్థనను మన్నించొద్దు)
టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, బ్యాంకులతో పరిష్కారానికి సిద్ధంగా ఉన్నట్టు మాల్యా న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. అయితే పరిష్కారం మొత్తం ఎంత ప్రతిపాదించారు అనేదానిపై స్పష్టత లేదు. అసలు రుణాలు, వాటిపై ఇప్పటి వరకు అయిన వడ్డీతో కలిపి 13,960 కోట్లు రూపాయలను చెల్లిస్తామంటూ గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (మాల్యా అప్పగింతపై సందేహాలు)
కాగా 9వేల కోట్ల రూపాయలకు పైగా రుణాల ఎగవేత ఆరోపణలతో మాల్యా ఈడీ, సీబీఐ కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. అయితే మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు కొన్ని చట్టపరమైన సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించాల్సి ఉందని బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. మరోవైపు శరణార్ధిగా దేశంలో ఉండేందుకు అంగీకరించాలంటూ బిట్రన్ ప్రభుత్వాన్ని మాల్యా అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment