హాజీపూర్‌లో బావివద్దకు భారీగా చేరుకున్న గ్రామస్తులు
సాక్షి, యాదాద్రి: ‘కూలీనాలీ చేసుకుని బతికేటోళ్లం.. రెక్కాడితేగాని కడుపు నిండని మా జీవితాల్లో ఆరని చిచ్చుపెట్టాడు. ముక్కు పచ్చలారని పిల్లల ఉసురు తీశాడు. కాయకష్టం చేసుకుని జీవించే ప్రశాంతమైన మా ఊరి పరువు బజారులో పెట్డాడు. అభం శుభం తెలియని ఆడపిల్లలను పొట్టన పెట్టుకున్న ఆ మానవ మృగాన్ని అప్పగిస్తే నిలువునా కాల్చి బూడిద చేస్తాం. హైదరాబాద్‌కు చేరువలో ఉన్నా బస్ సౌకర్యం లేని మా ఊరి దుస్థితిని పాలకులు పట్టించుకోరా..’అని హాజీపూర్ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో హత్యల ఉదంతంపై మంగళవారం పలువురిని ‘సాక్షి’పలకరించింది. గ్రామస్తుల్లో ఎక్కడ లేని ఆవేదన, ఆక్రోశం, భయం వ్యక్తమైంది. తమ గ్రామానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలను చంపి బావిలో బొందపెట్టిన నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు కాపాడుతున్నారని వారు ఆరోపించారు.
మాలోనే ఉన్నాడని తెల్వలే..
‘శ్రీనివాస్‌రెడ్డి తనకున్న భూమిలో అద్దెకరం అమ్మి ఊరి చివరన 6 నెలల క్రితం కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పసిపిల్లల ప్రాణాలు దారుణంగా తీసిన వాడి ఇల్లు ఊరంతా కలసి తగులబెట్టాం. అ ఇంటికి ఎప్పుడొస్తాడో ఎప్పుడు పోతాడో ఏం పని చేస్తాడో ఎవరికి తెల్వదు. శ్రావణి బావిలో శవమై కనిపించిన రోజు మాతోపాటే ఉన్నాడు. బావిలోకి ఇలా దిగాలి, అలా దిగాలి అని చెప్తుంటే ఆ మానవ మృగం మాలోనే ఉన్నాడని గుర్తించలేకపోయాం..’అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బిడ్డలను పొట్టన పెట్టుకున్నది ఊరివాడేనని తెలియడంతో వారంతా భయంతో వణికిపోతున్నారు. వ్యవసాయ పనులు, ఉపాధి పనులు చేసుకుని జీవించే తాము బయటకు వెళ్లాలంటే భయంతో హడలిపోతున్నామని చెప్పారు.
గ్రామానికి బస్సులు రాకనే..
‘మా గ్రామానికి బస్సులు సరిగా రావు. బొమ్మలరామారం నుంచి గ్రామానికి ఆటోలోనే రావాలి. ఒక్కరు ఆటోలో వస్తే 100 రూపాయలు తీసుకుంటారు. లేదంటే కాలినడకన రావాల్సిందే. ఈసీఐఎల్ నుంచి గ్రామానికి వచ్చే బస్‌లు పరిమితంగా వచ్చి ఇక్కడి నుంచే వెళ్లిపోతాయి. మధ్యాహ్నం బస్సులుండవు. హాజీపూర్–మైసిరెడ్డిపల్లి మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మిస్తే భువనగిరి–ఈసీఐఎల్ మధ్యన బస్‌లు ఎక్కువ ట్రిప్పులు తిప్పవచ్చు కానీ బ్రిడ్జి నిర్మాణం ప్రభుత్వం చేయడం లేదు. బస్‌లు సకాలంలో వస్తే మా పిల్లలు మేము సురక్షితంగా ఇల్లు చేరుతాం.’అని గ్రామస్తులు తమ సమస్యలు వివరించారు. గ్రామంలోని బెల్టు షాపుల మూసివేత, మత్తుమందుల అమ్మకం అరికట్టేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
బహిరంగంగా ఉరితీయాలి
శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరి తీయాలి. గ్రామంలో మహిళలు ఒంటరిగా తిరిగే పరిస్థితి లేదు. పోలీసులు సకాలంలో పట్టించుకుంటే ఇంతదాకా రాకపోయేది. మా కూతురు కనపడకుండా పోయినప్పుడే మేం ఫిర్యాదు చేశాం. అయినా అప్పుడు పట్టించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వాడికి శిక్షను బహిరంగంగానే అమలు చేయాలి. నేరాలు చేయాలంటే బయపడే విధంగా శిక్షలుండాలి.
–భాగ్యమ్మ (కల్పన తల్లి), మైసిరెడ్డిపల్లి
తలుచుకుంటేనే భయం వేస్తోంది
కూలీనాలీ కోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్తుంటాం. ఇలాంటి సంఘటనలు బయట పడుతుంటే భయం వేస్తోంది. ఇంట్లో ఉండి బతుకు సాగించలేం. హత్యలకు కారణమైన శ్రీనివాస్‌రెడ్డిని బహిరంగంగా ఉరితీయాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి.
–పరిద సత్తెమ్మ, హాజీపూర్
గంజాయి అమ్మకం ఆగాలి
గ్రామంలో గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్నారు. దీంతోనే యువకులు చెడిపోతున్నారు. ఈ హత్యలు కూడా గంజాయి తాగి చేసినవే. వెంటనే గ్రామంలో గంజాయి నిర్మూలన చేయాలి. ఊరిని కాపాడాలి.
–ఊట్ల మనీల, హాజీపూర్
Comments
Please login to add a commentAdd a comment