
తాళాలు తీసి ఉన్న ఇంటి ముందు కూతురితో వీణ
హిమాయత్‌నగర్: ‘కరోనా సమయంలో చిన్నపిల్లలు బయట తిరగకూడదంట. ఫంక్షన్లకు రాకూడదు. బంధువుల ఫంక్షన్ ఉంది నేనూ మీ ఆయన వెళ్తాం. ఒక కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్లు’ అని వివాహితను అత్త, భర్త నమ్మించారు. తీరా పుట్టింటి నుంచి వివాహిత తిరిగి రాగా ఇంటికి తాళం వేసి ఉంది. చుట్టు పక్కల వారిని విచారించగా చాలా కాలం నుంచి ఇంటికి తాళం వేసి ఉందని వారు సమాధానం చెప్పడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని విక్రమ్‌పురి పార్క్ వద్ద చోటు చేసుకుంది.
బాధితురాలి వివరాల ప్రకారం.. ముషీరాబాద్‌కు చెందిన వీణ, నారాయణగూడకు చెందిన మహేందర్ తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి 7 సంవత్సరాల కుమార్తె ఉంది. లాక్‌డౌన్ ప్రారంభం కాగానే భర్త, అత్త వీణను మార్చి నెలలో పుట్టింటికి పంపారు. కాగా ఆమె ఏప్రిల్ మాసంలో నారాయణ గూడలోని మెట్టింటికి రాగా తాళం వేసి ఉంది. అప్పటి నుంచి భర్త, అత్తలు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. భర్త, అత్తయ్య ఎక్కడ ఉన్నారో తెలియదని ఎన్నిసార్లు ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా సమాధానం ఇవ్వడం లేదని తెలిపింది. నారాయణగూడలోని పక్క వారిని అడిగితే మీ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతున్నారని వాపోయింది. ఇంట్లో తనకు సంబంధించిన బంగారం, డబ్బు, ఇతర సామగ్రి ఉన్నాయని తనకు న్యాయం చేయాలని కోరుతూ వీణ ఇంటి ముందు బైఠాయించింది.