ప్రాణంతీసిన ప్రేమోన్మాదం | woman found brutally murdered at home | Sakshi
Sakshi News home page

మూసాపేటలో యువతి దారుణ హత్య

Published Wed, Jan 10 2018 8:40 AM | Last Updated on Thu, Jan 11 2018 11:50 AM

woman found brutally murdered at home - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రేమోన్మాదం మరో యువతి ప్రాణాలు బలి తీసుకుంది. సంక్రాంతి పండుగ కోసం సొంతూరు వెళ్లేందుకు సెలవు పెట్టిన ఆమె.. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది.. ఊరెళ్లేందుకు టికెట్లు తీసుకుని.. షాపింగ్‌ కూడా పూర్తి చేసింది.. ఎన్నో ఆశలతో ఇంటికి చేరుకున్న ఆమెను ఓ ప్రేమోన్మాది అత్యంత పాశవికంగా హత్య చేశాడు. మంగళవారం రాత్రి మూసాపేట హబీబ్‌నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతురాలిని శ్రీకాకుళం జిల్లావాసి బోను జానకి(24)గా, నిందితుడిని వికారాబాద్‌ జిల్లావాసి ఆనంద్‌ అలియాస్‌ అనంతప్ప(27)గా పోలీసులు గుర్తించారు. మృతురాలు, నిందితుడు ఇద్దరూ డీమార్ట్‌ సంస్థలో పనిచేస్తున్నారని తెలిపారు.

ప్రేమించాలంటూ వేధింపులు..
పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా గుయ్యనవలస గ్రామానికి చెందిన బోను జానకి(24) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం నగరానికి వచ్చింది. సనత్‌నగర్‌లోని డీమార్ట్‌లో ఉద్యోగంలో చేరింది. అక్కడే పనిచేస్తున్న రూపావతితో కలసి మూసాపేట హబీబ్‌నగర్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లికి చెందిన ఆనంద్‌ అలియాస్‌ అనంతప్ప(27) కూడా అదే సంస్థలో పనిచేస్తున్నాడు. ప్రగతినగర్‌లో నివాసముంటున్న ఆనంద్‌.. జానకితో పరిచయం పెంచుకున్నాడు. అదే చనువుగా తీసుకుని ప్రేమించాలంటూ ఒత్తిడి తీసుకురాగా.. ఆమె సున్నితంగా తిరస్కరించింది. అతడి వేధింపులు తీవ్రస్థాయికి చేరడంతో 15 రోజుల క్రితం డీమార్ట్‌ యాజమాన్యానికి, ఆనంద్‌ స్వగ్రామంలోని పెద్దలకు చెప్పటంతో అతడిని పిలిచి మందలించారు. ఇక నుంచి జానకితో మాట్లాడనని, మరిచిపోతానని ఆనంద్‌ చెప్పాడు. ఇద్దరూ ఒకేచోట పనిచేయటం ఇబ్బందిగా ఉంటుందని జానకిని కేపీహెచ్‌బీ కాలనీ నాలుగో ఫేజ్‌లోని డీమార్ట్‌ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. అయినా జానకికి వేధింపులు తప్పలేదు. ఆనంద్‌ సనత్‌నగర్‌లో విధులు ముగించుకుని.. కేపీహెచ్‌బీ డీమార్ట్‌ వద్దకు వచ్చి తనను ప్రేమించాలంటూ మళ్లీ వేధింపులు మొదలెట్టాడు.

సొంతూరు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా..
సంక్రాంతి పండుగ కోసం బుధవారం సొంతూరు వెళ్లాలనుకున్న జానకి.. మంగళవారం నుంచి సెలవు తీసుకుని షాపింగ్‌ పూర్తి చేసి రూమ్‌కి చేరుకుంది. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె గది దగ్గరకు వచ్చిన ఆనంద్‌.. గడియ తీసి ఉండటంతో లోపలికి వెళ్లాడు. తన ప్రేమను తిరస్కరించిందనే కసితో జానకి గొంతు నులిమి.. రూమ్‌లోని కూరగాయలు కోసే కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. గది బయట గడియ వేసి పరారయ్యాడు. రూపావతి విధులు ముగించుకుని రూమ్‌కు రాగా.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ జానకి కనిపించడంతో కేకలు వేసింది. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. రూపావతి ఫిర్యాదు మేరకు కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జానకి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement