బనశంకరి: పెళ్లి చేసుకుంటానని మహిళా టెక్కీని నమ్మించి ఢిల్లీకి చెందిన మోసగా డు రూ.25 లక్షలు వసూలు చేసి ఉడాయించాడు. ఈ మేరకు రోనిత్ మల్హోత్రా అనే వ్యక్తిపై సర్జాపుర నివాసి 34 ఏళ్ల మహిళా ఐటీ ఇంజినీరు వర్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లి సంబంధాల కోసం ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో వివరాలు అప్‌లోడ్ చేసిన మహిళా టెక్కీని రోనిత్ మల్హోత్రా అనే వ్యక్తి తనది ఢిల్లీగా చెప్పుకుని సంప్రదించాడు. తాను వ్యాపారవేత్తనని, పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. ఇద్దరూ మొబైల్ నంబర్లు తీసుకున్నారు.
వసూళ్లు మొదలు
పెళ్లికి ముందు పూజ చేయాలని ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీన మంత్రి అపార్టుమెంట్, డాలర్స్‌కాలనీలో మహిళాటెక్కీ వద్ద రూ.7.5 లక్షలు తీసుకున్నాడు. తన చెల్లెలు, అన్న ద్వారా సదరు మహిళకు ఫోన్ చేయించి మాట్లాడాడు. ఫిబ్రవరి 23 తేదీన గుర్రప్పనపాళ్య కేఇబీ కాలనీలో మళ్లీ కలిశాడు. బంగారునగలు కొనుగోలు చేయాలని మళ్లీ రూ.6 లక్షలు గుంజాడు. కొద్దిరోజులకే డార్జిలింగ్‌లో తల్లి చనిపోయిందని అక్కడికి వెళ్లాలని భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. ఇలా పలు కారణాలు చెప్పి మహిళా టెక్కీ నుంచి రూ.25.2 లక్షలు జేబులో వేసుకున్నాడు. పెళ్లి విషయం వాయిదా వేయసాగాడు. డబ్బు వెనక్కి ఇవ్వాలని మహిళాటెక్కీ మోసగాడు రోనిత్ మల్హోత్రాను అడగ్గా బిజనెస్‌లో పెట్టుబడి పెట్టానని, చెల్లిస్తానని తెలిపాడు. కానీ ఇటీవల ఫోన్ చేయగా స్విచ్చాఫ్ రావడంతో బాధితురాలు సోమవారం వర్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment