
ప్రమాద దృశ్యం , ప్రమాదంలో మృతి చెందిన వరదరాజు, అశోక్
రెక్కాడితేగానీ డొక్కాడని కూలీలు వారు. ఉపాధి కోసం ఊరు వదిలి వలసబాట పట్టారు. బట్టీ పనుల్లోకి వెళ్లి కడుపునింపుకొందామని భావించారు. రాత్రికి రాత్రే బయల్దేరారు. ఏదో విధంగా గమ్యం చేరాలనే ఆత్రుతతో సిమెంట్ తూరలలోడుతో వెళుతున్న లారీ ఎక్కారు. ప్రమాదకరమని తెలిసినా రవాణా చార్జీలు కలిసివస్తాయనే ఆశతో ఉన్న కాస్త జాగాలోనే కూర్చున్నారు. అసలే శ్రమజీవులు.. లారీపైన కూర్చున్న వారు కాస్త కనుకుతీశారు. ఇంతలో వీరు ప్రయాణిస్తున్న లారీ ముందువెళుతున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టడం. ఆ లారీలో ఉన్న సిమెంట్ తూరలకు కట్టిన తాడు తెగి.. వెనుక కూర్చున్నవారిపై పడడం.. అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరుగురు గాయపడ్డారు.
తూర్పుగానుగూడెం (రాజానగరం): ప్రమాదమని తెలిసినా చార్జీలు తక్కువ అవుతాయనే ఆశతో లారీపై ప్రయాణిస్తూ పొట్టకూటి కోసం గ్రామాంతరం వెళుతున్న రెండు కుటుంబాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. రాజానగరం మండలం, తూర్పుగానుగూడెం వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సంతకవిటీ మండలం గెడ్డబురిడీపేటకు చెందిన బాగడి వరదరాజు(30), బాగడి వెంకటలక్ష్మి, బాగడి ప్రవీణ్‌కుమార్, అదే జిల్లాలోని పొండూరు మండలం గోకన్నపల్లికి చెందిన గరుగుపల్లి అశోక్ (8), మరో నలుగురితో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, సమీపంలోని కొత్తముప్పారానికి ఇటుక బట్టీ పనులు చేసేందుకు పయనమయ్యారు. ఒడిశాలోని ఖరక్‌ఫూర్ నుంచి విజయవాడకు భారీ సిమెంటు తూరలలోడుతో వెళుతున్న లారీని శ్రీకాకుళం వద్ద ఎక్కారు.
ఈ ఎనిమిది మందిలో ఐదుగురు కేబిన్‌లో కూర్చుంటే మిగిలిన ముగ్గురు తూరలలోడు ఉన్న ప్రాంతంలో కూర్చున్నారు. రాత్రి సమయం కావడంతో నెమ్మదిగా పడుకునేందుకు ఖాళీ చేసుకుని నిద్రపోయారు. ఇదే సమయంలో తూర్పుగానుగూడెం వద్ద ముందువెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని వీరు ప్రయాణిస్తున్న లారీ ఢీ కొనడంతో ప్రమాదానికి గురయ్యారు. సాధారణ తాడుతో కట్టి ఉన్న ఆ తూరలు కదిలిపోయి తాళ్లు ఊడిపోవడంతో ఆదమరిచి నిద్రపోతున్న ఆ అభాగ్యులలో బాగడి వరదరాజు, గరుగుపల్లి అశోక్‌లు వాటి కింద నలిగిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారితోపాటే ఉన్న ప్రవీణ్‌కుమార్ గాయాలతో బయటపడ్డాడు. అలాగే క్యాబిన్‌లో ఉన్న లారీ క్లీనర్ సీహెచ్ హరితోపాటు ఐదుగురు ప్రయాణికులు స్వల్పగాయాలయ్యాయి. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి, పోస్టుమార్టం అనంతరం వారి బంధవులకు అప్పగించారు. గాయపడిన ప్రవీణ్‌కుమార్‌కి ప్రాథమిక చికిత్స అందించగా, మిగిలిన వారు స్వల్పగాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరకుండానే వెళ్లిపోయారు. మృతుడి బంధువు జి.రమేష్ ఇచ్చిన ఫిర్యాదుననుసరించి కేసు నమోదు చేసిన రాజానగరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment