
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ భీమానాయక్
మార్కాపురం: మతిస్థిమితం కొల్పోయిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని కొండేపల్లి రోడ్డులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కొండేపల్లి రోడ్డులో నివాసం ఉండే మిరియాల వెంకటేశ్వర్లు, రాజేశ్వరి దంపతుల కుమారుడు మస్తాన్‌కు రెండేళ్ల కిందట మచిలీపట్నానికి చెందిన స్వప్నతో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కుమార్తె ఉంది. వీరిద్దరూ పాపతో కలిసి వేరే ఇంట్లో ఉంటారు. రెండేళ్లుగా మస్తాన్ మతిస్థిమితం కొల్పోయి తరుచూ ఇంటి నుంచి బయటకు వెళ్తుండేవాడు. కుటుంబ సభ్యులు కనుగొని ఇంటికి తీసుకొచ్చేవారు. భార్య స్వప్న అత్తింటికి వెళ్లి మధ్యాహ్నం సమయంలో ఇంటికి రాగా భర్త మస్తాన్ ఇంట్లో ఉరేసుకుని నిర్జీవంగా కనిపించాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ భీమా నాయక్, ఏఎస్‌ఐ మాణిక్యాలరావు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా వైద్యశాలకు తరలించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment