మోర్తాడ్: తమ జల్సాల కోసం అవసరమైన సొమ్మును సులభంగా కూడబెట్టుకోవడానికి బైకులను అపహరించడం ఎంచుకున్నారు ఏడుగురు యువకులు. చదువుకోవాల్సిన వయస్సులో గంజాయి, మద్యం, ఇతర మత్తుపదార్థాలకు అలవాటుపడిన యువకులకు పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేసి తక్కువ ధరకు విక్రయించారు. వచ్చిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తూ వాహనాల చోరీయే వృత్తిగా మలచుకున్నారు. చివరకు ముప్కాల్ పోలీసులకు పట్టుబడి కటకటాలపాలయ్యారు. ముప్కాల్ ఎస్‌ఐ రాజ్‌భరత్ రెడ్డి ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్, ఐడీ పార్టీ కానిస్టేబుల్ గంగాప్రసాద్, కానిస్టేబుల్లు భూమేష్, శ్రీకాంత్, రాజా సాగర్, సాగర్ చాకచాక్యంగా వ్యవహరించి అంతర్ జిల్లాల బైకుల దుండగుల ముఠాను పట్టుకున్నారు. అంకాపూర్‌కు చెందిన ప్రశాంత్ ముప్కాల్‌లోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఒక పల్సర్‌ను తక్కువ ధరకు విక్రయించాడు. అప్పటికే ముప్కాల్‌లో రెండు వాహనాలు చోరీకి గురయ్యాయి.
ప్రశాంత్ వ్యవహారశైలిపై సందేహం వ్యక్తం చేసిన పోలీసులు అతడిపై కన్నేసి ఉంచారు. తక్కువ ధరకే బైకుని ప్రశాంత్ విక్రయించిన విషయంపై ఆరా తీసిన పోలీసులు సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆరు జిల్లాల్లో తమ ముఠా చోరీ చేసిన బైకుల వివరాలను, ముఠా సభ్యుల పేర్లను వెల్లడించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కమ్మర్‌పల్లి మండలం కోనాసముందర్‌కు చెందిన సందీప్, మెట్‌పల్లికి చెందిన రాము, రఘు, అంకాపూర్‌కు చెందిన నషీద్, భీమ్‌గల్‌కు చెందిన అజయ్, చరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు చోరీ చేసి విక్రయించిన వాహనాలతో పాటు దాచిన కొన్ని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల నుం చి మొత్తం 24 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఒకే రకం వాహనాలే ఎక్కువ..
అంతర్ జిల్లా దొంగల ముఠా చోరీ చేసిన వాహనాల్లో ఎక్కువగా బజాజ్ పల్సర్ వాహనాలే ఉన్నాయి. పల్సర్ వాహనాలకు హ్యాండిల్ లాక్ వేసినా సులభంగా తొలగించి స్టార్ట్ చేసే అవకాశం ఉండటంతో పార్కింగ్ చేసి ఉంచిన వాహనాల్లో ఈ ముఠా పల్సర్ వాహనాలనే చోరీ చేశారు. బుల్లెట్ వాహనానికి కూడా సులభంగా లాక్ తీయడం స్టార్ట్ చేయడం రావడంతో ఈ వాహనాలనే ముఠా సభ్యులు ఎంచుకున్నారు. నిజామాబాద్, సిద్దిపేట్, కామారెడ్డి, మెట్‌పల్లి, నిర్మల్, కరీంనగర్, హైదరాబాద్‌లలో పల్సర్, బుల్లెట్ వాహనాలను చోరీ చేశారు. వాటన్నింటిని చోరీ చేసిన చోట కాకుండా వేరే ప్రాంతానికి తీసుకువచ్చి రూ.10వేల నుంచి రూ.25వేలకే విక్రయించారు. అయితే ఒరిజినల్ కాగితాలు మళ్లీ తెచ్చి ఇస్తామని చెప్పి వాహనాలు కొనుగోలు చేసినవారు ఎంత సొమ్ము ఇస్తే అంత తీసుకుని జల్సాలు చేయడం ఈ ముఠా సభ్యుల ప్రవృత్తిగా మారింది.
వాహనం నడుపరాకున్నా టెక్నిక్‌లో దిట్ట..
బైకుల చోరీలో ప్రధాన పాత్ర పోషించిన కోనాసముందర్‌కు చెందిన సందీప్‌కు వాహనం నడుపరాదు. అయితే టెక్నిక్‌తోని వాహనాల లాక్‌లను తొలగించడం, ఆ వాహనాలను స్టార్ట్ అయ్యే విధంగా చేయడం సందీప్ పని అని పో లీసుల విచారణలో తేలినట్లు తెలిసింది. సందీప్ తన స్నేహితుల ద్వారానే ఈ ముఠాలో ఉన్న సభ్యులతో స్నేహం చేసి గడచిన ఏడాది కాలం గా వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. వాహనాలను చోరీ చేశాక మళ్లీ ఎప్పటిలాగే ఎవరి ఇండ్లకు వా రు వెళ్లిపోయి వారం రోజుల తరువాతనే వాహ నాలను విక్రయించి సొమ్ము చేసుకుంటారని పోలీసుల పరిశోధనలో తేలింది. బైకుల చోరీతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ముఠాను ముప్కాల్ పోలీసులు పట్టుకోవడంతో వారిని సీపీ కార్తికేయ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment