దుస్తులు విప్పించి కొడుతున్నాడు.. కాపాడండి
న్యూఢిల్లీ: బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్న భారతీయులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. యజమానుల చేతిలో చిత్రహింసలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు ఒకటి వెలుగుచూసింది. ఉపాధి కోసం ఖతర్కు వెళ్లిన ఉత్తర్ప‍్రదేశ్‌కు చెందిన ఇద్దరు యువకులను దారుణంగా హింసించారు. పైఅధికారి ఒకరు వీళ్ల లోదుస్తులు విప్పించి, గుర్రం పగ్గం తీసుకుని రక్తం వచ్చేలా విచక్షణరహితంగా కొట్టాడు. వాళ్ల చేతులు, కాళ్లు, తొడలు, వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తమకు తగిలిన గాయాలను వీడియో తీసి పంపారు. తాము ఆపదలో ఉన్నామని ఆదుకోవాల్సిందిగా విన్నవించారు.
ఉత్తరప్రదేశ్కు చెందిన పర్వేజ్ అహ్మద్ (24), మహ్మద్ అక్రమ్ (27) నాలుగు నెలల క్రితం పుణెకు చెందిన ఓ ఏజెంట్ ద్వారా ఖతర్ వెళ్లారు. పర్వేజ్ ఐదేళ్ల కాలపరిమితిపై డ్రైవర్గా పనిచేసేందుకు వర్క్ వీసాపై వెళ్లాడు. కాగా వీరిద్దరినీ సౌదీ అరేబియా-ఖతర్ సరిహద్దున ఉన్న ఓ ఫామ్‌కు తీసుకెళ్లి మేకలు, ఒంటెల సంరక్షణ బాధ్యత అప్పగించారు. అక్కడ పనిచేస్తున్న ఓ అధికారి తమను చిత్రహింసలకు గురిచేస్తున్నాడని పర్వేజ్ వీడియోలో తెలిపాడు. ఇక్కడ నరకం అనుభవిస్తున్నామని, ఇక్కడ పనిచేయడం కంటే జైల్లో ఉండటం మేలని వాపోయాడు. పర్వేజ్ ఢిల్లీలో ఉన్న తన స్నేహితుడు అఫ్తామ్ ఆలంకు ఈ విషయాలు తెలిపాడు. గాయాలతో ఉన్న పర్వేజ్, అక్రమ్ ఫొటోలను ఆలంకు పంపాడు. తాము సాయం కోరామని తెలిస్తే ఆ అధికారి తమను వేరే ప్రాంతానికి పంపించే అవకాశముందని, తమను తప్పుడు కేసులో ఇరికించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమను కాపాడాలని పర్వేజ్ విన్నవించాడు.