పాపా! నీ శ్వాసకు మేమిస్తాం భరోసా!
-ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తకు అభయహస్తం
-రూ.1.7 లక్షల సాయం అందించిన చినమిల్లి సోదరులు
పి.గన్నవరం : అణువణువునా ఉత్సాహం తొణుకుతూ, అనాయాసంగా ఆటలాడాల్సిన ఈడులోనే ఆ పాపకు నాలుగడుగులు నడిస్తేనే రొప్పు తప్పడం లేదు. చిన్నవయసులోనే పెద్ద సమస్య వచ్చిపడ్డ ఆమె బతుకుకు కొత్త ఊపిరినిచ్చేందుకు ముందుకు వచ్చారు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న చినమిల్లి వెంకట రామకృష్ణ (అమెరికా), కొండయ్యనాయుడు (హైదరాబాద్) సోదరులు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న పి.గన్నవరం శివారు బోడపాటివారిపాలేనికి చెందిన ఏడేళ్ల సారిక హారికాప్రియకు ఆమె తల్లిదండ్రులు ఇప్పటికే మూడు లక్షల అప్పుచేసి వైద్యం చేయించారు. మరో నాలుగు లక్షలు అవసరం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలిసిన రామకృష్ణ, కొండయ్యనాయుడు హృదయం కదిలి వైద్యం నిమిత్తం తమ తల్లిదండ్రులు భుజంగరావు, అనంతలక్ష్మిల ద్వారా శుక్రవారం రూ.1.7 లక్షల సాయం అందించారు. ఈ సందర్భంగా వారికి బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలపగా పలువురు అభినందించారు. అనంతరం భుజంగరావు, అనంతలక్ష్మి పి.గన్నవరం సీహెచ్‌సీకి సైకిలును బహూకరించారు. మాజీ సర్పంచ్ యడ్లపల్లి పెద్దబ్బులు, రుద్రా సుబ్బారావు, సాధనాల శ్రీనివాసరావు, గణేశుల చినకొండలరావు, సుబ్బారాయుడు, అడ్డగళ్ల నానాజీ, సాధనాల ఎస్పీ, కాళీకృష్ణ, నల్లా పెదకాపు, సుంకర రాంబాబు, యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.