232 బస్తాల చౌక బియ్యం పట్టివేత
సత్తెనపల్లి: చౌక దుకాణాల నుంచి రేషన్ బియ్యం అక్రమంగా సేకరించి రీసైక్లింగ్ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు సమాచారం అందడంతో సోమవారం దాడులు నిర్వహించారు. డీఎస్పీ వి.వి.రమణ కుమార్ నేతృత్వంలో సీఐ ఎన్.కిషోర్‌బాబు సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని విఘ్నేశ్వర ట్రేడర్స్ రైస్‌మిల్లులో ఈమేరకు తనిఖీలు చేపట్టారు. అప్పుడే లారీలో వచ్చిన బియ్యాన్ని దాడి చేసి పట్టుకున్నారు. మిల్లులో 202 తెల్లగోతాల్లో, 30 గన్ని బ్యాగులో రేషన్ బియ్యాన్ని గుర్తించారు. మొత్తం రూ. 3 లక్షలు విలువ చేసే 116 క్వింటాళ్ళ చౌక బియ్యన్ని పట్టుకున్నారు. ఇదే మిల్లులో గత జూన్‌లో కూడా దాడి చేసి బియ్యం పట్టుకుని కేసు నమోదు చేయడంతోపాటు, సీజ్ చేసినట్లు డీఎస్పీ రమణకుమార్ తెలిపారు. ఎక్కడైనా చౌక బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లయితే విజిలెన్స్ ఎస్పీ 80082 03288, డీఎస్పీ 80082 03289, సీఐ 80082 03291 నెంబర్లకు తెలియజేయాలని కోరారు. దాడుల్లో విజిలెన్స్ ఏఓ కె.వెంకటరావు, కానిస్టేబుళ్ళు నాంచారయ్య, నాగేశ్వరరావు, రాము, రాంబాబు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ దరియావలి, గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు.